రాపాక కామెంట్లు... పీకేకు గట్టిగానే తగిలాయిగా

Tue Aug 11 2020 22:22:41 GMT+0530 (IST)

Rapaka comments ... PK was hit hard

సినిమాల్లో పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కల్యాణ్ కు రాజకీయాలు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో జనసేనకు దక్కిన ఆదరణే ఇందుకు నిదర్శనమని చెప్పక తప్పదు. ఎన్నికల్లో అంచనాలన్నీ తలకిందులు కాగా... తన పార్టీ టికెట్ పై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అయినా అసెంబ్లీలో పార్టీ వాయిస్ ను వినిపిస్తారని పవన్ ఆశించారు. అయితే ఎన్నికల్లో తగిలిన దెబ్బలపై కారం పూస్తున్న మాదిరిగా రాపాక ఎప్పటికప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ పవన్ కు దెబ్బ మీద దెబ్బలేస్తున్నారు. ఇప్పటికే పవన్ ఇమేజీని ఓ రేంజిలో డ్యామేజీ చేసిన రాపాక... తాజాగా చేసిన వ్యాఖ్యలతో అసలు జనసేనకు జనంలో బలమే లేదని తేల్చి పారేశారు.అయినా తాజాగా రాపాక ఏమన్నారన్న విషయానికి వస్తే.. ‘‘జనసేన నుంచి సొంత బలంతో ఎమ్మెల్యేగా గెలిచా. నేను గెలిచిన జనసేన నిలబడే పార్టీ కాదు. జనసేన నుంచి ఏదో గాలివాటంగా నేను మాత్రమే గెలిచా. పార్టీ ఇష్టం లేకపోయినా కేవలం వ్యక్తిని బట్టే ఎమ్మెల్యేగా గెలిచా. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టిక్కెట్ కోసం ప్రయత్నించా. తప్పని పరిస్థితుల్లో వేరేవాళ్లకు టిక్కెట్ ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లగానే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశా. జగన్‌తో కలిసి వైసీపీలోనే పనిచేస్తున్నా’’అని రాపాక వరప్రసాద్ అన్నారు.

మొత్తంగా జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాపాక... తాను గెలిచింది కూడా పార్టీ ప్రభావంతో కాదని తన వ్యక్తిగత బలంతోనే గెలిచానని తేల్చి పారేశారు. ఏదో వైసీపీలో చివరి నిమిషంలో అవకాశం దక్కకపోవడంతోనే తాను జనసేనలో చేరానని చెప్పిన రాపాక... జనసేన టికెట్ పై గెలిచినా.. ప్రస్తుతం తాను జగన్ తో కలిసి వైసీపీతోనే సాగుతున్నానని చెప్పకనే చెప్పేశారు. గెలిచిన పార్టీని కాదని టికెట్ నిరాకరించిన పార్టీతోనే కలిసి సాగుతున్నానని రాపాక చెబితే... పవన్ ను మరింత ఆగ్రహానికి గురి చేసేదే కదా.