Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ కు ఎమ్మెల్యే షాక్‌..ప‌ట్టునెగ్గించుకున్న జ‌గ‌న్

By:  Tupaki Desk   |   27 Jan 2020 1:37 PM GMT
ప‌వ‌న్‌ కు ఎమ్మెల్యే షాక్‌..ప‌ట్టునెగ్గించుకున్న జ‌గ‌న్
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి పంతం నెగ్గింది. ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. ఆర్టికల్ 169-1 ప్రకారం మండలిని రద్దు చేస్తూ సభ తీర్మానం చేసింది. మండలిని రద్దు చేయాలన్న సీఎం జగన్ తీర్మానానికి అనుకూలంగా 133 మంది సభ్యులు ఓటేశారు. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే, ఓటుకు ముందు ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మండలి రద్దుపై నిర్వ‌హించిన చ‌ర్చ‌లో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును మండలి సభ్యులు అడ్డుకోవడం సరికాదని అన్నారు. అధికార వికేంద్రీకరణ - అభివృద్ధి వికేంద్రీకరణ కార్యక్రమాలను చేపట్టడం వల్లే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించగలుగుతుందని చెప్పారు. అలాంటి నిర్ణయాన్ని తీసుకోవడంతో పాటు బిల్లును కూడా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తాను అభినందిస్తున్నానని అన్నారు. అసెంబ్లీలో మేధావులు - డాక్టర్లు - ఐపీఎస్‌ అధికారులు ఉండగా.. ఇక పెద్దల సభ ఎందుకంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను అని అన్నారు. ఇంతమంది రాజకీయ ప్రముఖులు ఉన్నాక.. మళ్లీ మండలి అవసరం లేదని రాపాక స్పష్టం చేశారు. గ‌తంలో ఇంగ్లిష్ మీడియం బిల్లు విష‌యంలో కూడా మండ‌లి అడ్డుపుల్ల వేసింద‌న్నారు. మండ‌లి ర‌ద్దు తీర్మానానికి తాను మద్దతు పలుకుతున్నానని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుపై సైతం రాపాక మండిప‌డ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆయన స్థాయికి దిగజారి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రాపాక ఆరోపించారు. ``ఏకంగా మండలి చైర్మన్‌ షరీఫ్‌ ను కూడా ఆయన ప్రభావితం చేశారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపుతున్నాను అని చెప్పడానికి చైర్మన్‌ ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ విధంగా చేయడం చంద్రబాబుకు సరికాదు.సీఎం జగన్‌ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారు.గడిచిన ఆరు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.`` అని ప్ర‌శంసించారు. కాగా హాజ‌రైన స‌భ్యులంద‌రితో తీర్మానం ర‌ద్దుకు మ‌ద్ద‌తు పొందిన జ‌గ‌న్ త‌న పంతం నెగ్గించుకోగా...జ‌న‌సేన ఏకైక ఎమ్మెల్యే ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌ కు షాకిచ్చార‌ని అంటున్నారు.