టీటీడీ ఆస్తులపై నేషనల్ ఆడిట్ కావాలట.. ఎవరి డిమాండో తెలుసా?

Tue May 26 2020 22:28:03 GMT+0530 (IST)

Getting a National Audit on TTD Assets

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆస్తులకు సంబంధించి ఇప్పుడు పెద్ద దుమారమే రేగింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన భూముల్లో కొన్నింటిని వేలం వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేసిన యత్నం పెను కలకలాన్నే రేపింది. ఇలాంటి సమయంలో తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరో కలకలం రేపారు. శ్రీవారి ఆస్తులన్నింటిపై ఏకంగా జాతీయ స్థాయిలో ఆడిట్ జరగాలని ఆయన ఓ సంచలన డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా చేసిన తన డిమాండ్ ను ఆయన నేరుగా బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్యస్వామికి ట్యాగ్ చేశారు. ఓ వైపు శ్రీవారి ఆస్తుల వేలం రద్దుపై రచ్చ సాగుతుండగా... దీక్షితులు ఏకంగా జాతీయ స్థాయి ఆడిట్ అంటూ డిమాండ్ చేయడం నిజంగానే సంచలనంగానే మారిందని చెప్పాలి.ఈ డిమాండ్ ను రమణ దీక్షితులు ఆషామాషీగా ఏమీ చేయలేదు. శ్రీవారి ఆస్తులు ఆభరణాలపై జాతీయస్థాయి ఆడిట్ జరగాలంటూ ట్వీట్ చేసిన రమణ దీక్షితులు.. ఎన్టీఆర్ కాలం నుంచి నేటి వరకు టీటీడీ ఆస్తులు ఆభరణాలు ఆదాయం ఖర్చులపై జాతీయ స్థాయిలో ఆడిట్ జరపాలని డిమాండ్ చేశారు. అంటే... దాదాపుగా టీటీడీ ఆవిర్భావం నుంచి కూడా శ్రీవారికి చెందిన ఆస్తులపై ఆడిట్ జరగాలని దీక్షితులు డిమాండ్ చేసినట్టేనని చెప్పక తప్పదు. శ్రీవారి ఆభరణాలు అందులోనూ పింక్ డైమండ్ ను కొందరు అమ్ముకున్నారంటూ ఇప్పటికే ఓ రేంజిలో ఆరోపణలు వినిపిస్తున్న వేళ... జాతీయ స్థాయి ఆడిట్ అంటూ దీక్షితులు డిమాండ్ చేయడం నిజంగానే సంచలనమనే చెప్పాలి.

ఇప్పటికే వైసీపీ పాలనలో టీటీడీ తీసుకున్న శ్రీవారి ఆస్తుల నిర్ణయంపై విమర్శలు రేకెత్తిన సంగతి తెలిసిందే. అటు టీడీపీతో పాటు ఇటు బీజేపీ జనసేన వామపక్షాలు మొత్తంగా అధికార పార్టీ మినహా అన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా... నిరర్ధక ఆస్తులుగా మారిపోయిన ఆస్తుల వేలాన్ని టీటీడీ నిలిపివేసింది. అయినా ఈ వేలం తమ హయాంలో మొదలైందని కాదని వైసీపీతో పాటు ఇటు టీటీడీ చైర్మన్ గా ఉన్న జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి చెబుతూనే... వేలాన్ని వాయిదా వేస్తున్నట్లుగా సోమవారం ప్రకటించారు. అక్కడితో ఈ వివాదం సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో శ్రీవారి ఆస్తులపై జాతీయ స్థాయి ఆడిట్ జరగాలంటూ రమణ దీక్షితులు డిమాండ్ చేయడం గమనార్హం.