ప్రముఖులకు వార్నింగ్ గా రాకేశ్ ఝున్ ఝున్ వాలా అకాల మరణం!

Sun Aug 14 2022 21:00:01 GMT+0530 (IST)

Rakesh JhunJhunWala Death is Warning to Celebrities

భారత్ వారెన్ బఫెట్ గా అభివర్ణించే రాకేశ్ ఝున్ ఝున్ వాలా అకాల మరణం అందరిని షాక్ కు గురి చేసింది. ఆయన అకాల మరణం చాలామందికి హెచ్చరికగా మారిందని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాదాసీదా బతుకులు బతికే వారే తమకు సమయం సరిపోవటం లేదనే మాట తరచూ వస్తుంటుంది.అలాంటిది.. వేలాది కోట్ల ఆస్తులతో ఉన్న సంపన్నుడికి సమయం సరిపోయే అవకాశం ఉంటుందా? దీనికి తోడు నియంత్రణ లేని కొన్ని అలవాట్లు ఉంటే..ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అలాంటిదే రాకేశ్ విషయంలోనూ చోటు చేసుకుంది. గతంలో మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల్ని పంచుకున్నారు.

వ్యాపారాల్లో తలమునకలైన తాను వీకెంట్ అయితే రేసులకు వెళ్లేవాడినని.. అర్థరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చేవాడినని చెప్పుకొన్నారు. తన తీరుతో తన భార్య ఇబ్బంది పడేదన్నారు. తమకు ఆలస్యంగా పిల్లలు పుట్టటం.. వారు పుట్టిన తర్వాత వీకెండ్ వారి కోసం కేటాయించినట్లు చెప్పారు. పెళ్లైన 17 ఏళ్లకు (2004) అమ్మాయి పుట్టింది. 2009లో ఇద్దరు అబ్బాయిలు కవలలు పుట్టినట్లుగా చెప్పారు.

సంపన్నులే అయినప్పటికీ తాము తమ పిల్లలకు మధ్యతరగతి కుటుంబాన్నే పరిచయం చేశామని చెప్పేవారు. అందుకే.. తమ పిల్లల్ని అలాంటి స్కూళ్లలోనే చేర్పించినట్లు చెప్పారు. తానుజీవితంలో ఏమైనా పశ్చాత్తాపడే అంశాలు ఉన్నాయంటే.. సిగిరెట్లు.. మద్యం అలవాట్లేనని చెప్పుకొచ్చారు. సిగిరెట్లు.. మందు ఎక్కువగా తాగేవాడినని.. తిండిపైనా నియంత్రణ ఉండేది కాదన్నారు. తాను సిగిరెట్లు మానేశానని.. తిండీ తగ్గించేశానని చెప్పారు.

అయితే.. ఈ అలవాట్ల కారణంగా ఇప్పటికే కొంతమేర ఆరోగ్యం పాడైందని.. గతాన్ని మార్చుకునే అస్కారం తనకు లేదని.. కానీ ఫ్యూచర్ ను తీర్చిదిద్దుకునే అవకాశం ఉందన్నారు. అందుకే.. యువతకు తానీ విషయాల్ని చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. నిజమే.. ఆయన పశ్చాత్తాపం చెందారు కానీ.. అప్పటికే ఆలస్యమైంది. ఆ తప్పులే ఇప్పుడు ఆయన్ను అర్థాంతరంగా వెళ్లిపోయేలా చేసింది.

అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు మద్యం.. సిగిరెట్లు లాంటి అలవాట్లకు దూరంగా ఉండాల్సిన అవసరం రాకేశ్ ఝున్ ఝున్ వాలా జీవితం చెప్పేస్తుందని చెప్పాలి. ఒకరకంగా ఆయన మరణం.. పలువురు ప్రముఖులకు హెచ్చరికలా మారిందని చెప్పకతప్పదు.