Begin typing your search above and press return to search.

పెళ్లి కూతురు పరార్‌.. పెళ్లి దుస్తులతోనే 13 రోజులున్న పెళ్లి కొడుకు!

By:  Tupaki Desk   |   29 May 2023 5:01 PM GMT
పెళ్లి కూతురు పరార్‌.. పెళ్లి దుస్తులతోనే 13 రోజులున్న పెళ్లి కొడుకు!
X
పెళ్లి పీటల మీదే పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు అనేకం. పెళ్లి మండపంలో దుస్తులు మార్చుకొస్తాను లేదా బాత్‌ రూంకు వెళ్లొస్తాను అంటూ పారిపోయిన పెళ్లి కొడుకులు, పెళ్లి కుమార్తెలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి సంఘటనే రాజస్థాన్‌ లో జరిగింది. పెళ్లి కూతురు పెళ్లి మండపం నుంచి పరార్‌ అయ్యింది. అయితే పెళ్లి కొడుకు 13 రోజులపాటు పెళ్లి దుస్తులతోనే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. ఎట్టకేలకు ఆమెను తీసుకొచ్చిన తల్లిదండ్రులు, బంధువులు వరుడికిచ్చి పెళ్లి చేయడంతో శుభం కార్డు పడింది.

ఈ ఆసక్తికర ఘటన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ లోని పాలీ జిల్లాలోని సౌణా గ్రామానికి చెందిన సకారామ్‌ కుమార్తె మనీషాకు వారి బంధువైన శ్రవణ్‌ కుమార్‌ తో పెళ్లి కుదిరింది. పెళ్లి వేడుకలో భాగంగా వరుని తరుపు వారంతా మే 3న పెళ్లికుమార్తె ఉంటున్న గ్రామానికి వెళ్లారు. అక్కడ వారికి అపూర్వ రీతిలో పెళ్లి కుమార్తె తరపు వారు స్వాగత సత్కారాలు పలికారు.

మే 4న ఉదయం వివాహం జరపడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా పెళ్లి మండపంలోకి పెళ్లి కుమార్తెను తీసుకురావాలని పురోహితుడు కోరాడు. అయితే ఇందుకోసం కొద్దిసేపు వేచి ఉండాలని పెళ్లి కుమార్తె తరపువారు చెప్పారు.

వధువు మనీషా తనకు విపరీతంగా కడుపునొప్పి వస్తున్నదని చెప్పి ఇంటి వెనుకవెపు వెళ్లింది. తరువాత అక్కడే తన కోసం వేచిచూస్తున్న ఒక బంధువుతో కలసి అక్కడి నుంచి పారిపోయింది. ఎంతసేపయినా పెళ్లి కుమార్తె తిరిగి రాకపోవడంతో బంధువులంతా బెదిరిపోయారు.

ఈ సందర్భంగా పెళ్లికుమార్తె తండ్రి మాట్లాడుతూ... తన కుమార్తె పెళ్లి బట్టలు వేసుకునేందుకు గదిలోనికి వెళ్లిందన్నారు. ఆ తరువాత కడుపు నొప్పిగా ఉందని టాయిలెట్‌ కు వెళ్లిందని తెలిపారు. తరువాత తన మామ కుమారుడు భరత్‌ కుమార్‌ తో కలిసి బయటకు వెళ్లిపోయినట్టు తెలిసిందన్నారు. కాగా బంధువులు ఎంత నచ్చచెప్పినా మనీషా పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. ఇలా ఆమె 13 రోజుల పాటు ఇంటిలోనే మొండికేసి కూర్చుంది.

అయితే పెళ్లి కూతురు మనీషాను బాగా ఇష్టపడ్డ వరుడు ఇందుకు ఆమెపై కోపం తెచ్చుకోలేదు. పెళ్లి అలంకరణలో భాగంగా తాను ధరించిన పగడీ కూడా తీయకుండా మనీషా కోసం అలాగే ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అన్ని రోజులపాటు పెళ్లి మండపాన్ని అలంకరణతోనే ఉంచడం విశేషం.

ఎట్టకేలకు బంధువులంతా మనీషాను ఒప్పించారు. దీంతో పెద్దల మాటలకు మెత్తబడ్డ మనీషాను మే 15న కల్యాణ మండపానికి వచ్చింది. దీంతో మే 16 వారి వివాహం ఘనంగా జరిగింది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మీడియాలో వైరల్‌ గా మారింది.