Begin typing your search above and press return to search.

వారసుడెవరో తేలిపోతుందా ?

By:  Tupaki Desk   |   25 Sep 2022 4:35 AM GMT
వారసుడెవరో తేలిపోతుందా ?
X
రాజస్ధాన్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇంట్లో సీఎల్పీ సమావేశం జరగబోతోంది. రాజస్ధాన్ ముఖ్యమంత్రి ఎవరనే విషయం తేల్చేందుకు సీఎల్పీ సమావేశం జరగబోతోందని సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పోటీచేయబోతున్నారు. జోడుపదవులను నిర్వహించకూడదనే పార్టీ నియమావళి ప్రకారం సీఎం పోస్టుకు రాజీనామా చేయబోతున్నారు.

ఏకకాలంలో పార్టీకి అధ్యక్షుడిగాను రాజస్ధాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించేందుకు అశోక్ చివరినిముషం వరకు ఎంతగా ప్రయత్నించినా సోనియాగాంధీ, రాహుల్ గాంధి అంగీకరించలేదు. దాంతో వేరేదారిలేక చివరకు సీఎం పదవికి గుడ్ బై చెప్పబోతున్నారు. ఇదే సమయంలో తన వారసుడు ఎవరనే విషయాన్ని తానే నిర్ణయించాలని గట్టిగా పట్టుబడుతున్నారు. తాను సూచించిన నేతకే సీఎం పోస్టు ఇవ్వాలని సోనియా, రాహుల్ దగ్గర గట్టిగా పట్టుబట్టారు. అయితే సీఎల్పీ సమావేశం ద్వారానే ఎంపికచేద్దామని వాళ్ళు చెప్పారు.

అశోక్ ఛాయిస్ అయితే అసెంబ్లీ స్పీకర్ జోషీయే. అయితే సీఎం కుర్చీలో కూర్చునేందుకు యువనేత సచిన్ పైలెట్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి సచిన్ కృషి చాలావుంది. అందరు సచినే సీఎం అవుతారని అనుకున్నారు కానీ అనూహ్యంగా అశోక్ వచ్చి కుర్చీలో కూర్చున్నారు. అప్పటినుండి సచిన్ ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. దాంతో అశోక్-సచిన్ మధ్య తీవ్రస్ధాయిలో విభేదాలు పెరిగిపోయాయి.

ఇపుడు కూడా సచిన్ సీఎం కాకూడదని అశోక్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే సోనియా, రాహుల్ మద్దతు సచిన్ కే ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ సచిన్ను కాదంటే పార్టీలో చీలక వచ్చి ప్రభుత్వం పడిపోతుందేమో అనే టెన్షన్ కూడా పెరిగిపోతోంది. అందుకనే ఈరోజు జరగబోయే సీఎల్పీ సమావేశానికి ప్రాధాన్యత పెరిగిపోతోంది. మరి అశోక్ ఎవరిని ప్రపోజ్ చేస్తారో, ఎంఎల్ఏలు ఎవరిని ఎన్నుకుంటారో చూడాల్సిందే.