పాముల్ని అలా చేస్తే తాట తీస్తానన్న ఎమ్మెల్యే

Thu Aug 16 2018 13:17:10 GMT+0530 (IST)

Raja Singh Says Save Snakes During naga Panchami

వివాదాలకు.. వివాదాస్పద వ్యాఖ్యలకే కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఆయన.. గడిచిన కొద్ది రోజులుగా తరచూ వార్తల్లోకి వస్తున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా మరే బీజేపీ ఎమ్మెల్యేకు టైమివ్వకుండా ప్రత్యేకంగా గోషామహల్ రాజాసింగ్ తో భేటీ కావటం తెలిసిందే.ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు తనకు టైమివ్వటంతో ఉక్కిరిబిక్కిరి అయిన రాజాసింగ్.. అప్పటి నుంచి రెట్టించి ఉత్సాహంతో మరింతగా దూసుకెళుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి కీలకంగా మారతాడని భావిస్తున్న రాజాసింగ్.. అందుకు తగ్గట్లే దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా పాములోళ్లకు.. పాములను హింసించేవారికి ఘాటు హెచ్చరికల్ని జారీ చేశారు. నాగులచవితి సందర్భంగా పాములను ఇళ్ల ముందుకు తీసుకొచ్చి డబ్బులు అడిగే వారి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పటమే కాదు.. అలాంటి వారి తాట తీస్తానని చెప్పారు.

హిందువులు దైవంగా భావించే పాముల నోటికి ప్యాక్ చేసి హింసిస్తే ఊరుకునేది లేదన్నారు. తన నియోజకవర్గం పరిధికి చుట్టుపక్కల ఉండే జియాగూడ.. కార్వాన్ లతో పాటు పలు ప్రాంతాల్లో ఇలా పాముల్ని హింసించే వారి నుంచి 75 పాముల్ని తమ కార్యకర్తలు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు. రానున్న రోజుల్లో రాజా సింగ్ మరెన్ని ప్రకటనలు చేస్తారో..?