Begin typing your search above and press return to search.

ద‌క్షిణాదిపై రాహుల్ గురి.. వ్యూహ‌మేంటి?

By:  Tupaki Desk   |   24 Jan 2021 3:30 PM GMT
ద‌క్షిణాదిపై రాహుల్ గురి.. వ్యూహ‌మేంటి?
X
కాంగ్రెస్ పార్టీ చూపు ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప‌డింది. ముఖ్యంగా పార్టీ ముఖ్య‌నాయ‌కుడు, గాంధీల వార‌సుడు రాహుల్ గాంధీ.. ద‌క్షిణాది రాష్ట్రాల జ‌పం చేస్తున్నారు. గ‌త 2019 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో ఆయ‌న గ‌తానికి భిన్నంగా కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీచేశారు. వాస్త‌వానికి దీనికి ముందు వ‌రుస‌గా మూడు సార్లు.. యూపీలోని అమేథీ నుంచి గెలిచిన రాహుల్‌.. అనూహ్యంగా ద‌క్షిణాది రాష్ట్ర‌మైన కేర‌ళ‌ను ఎంచుకుని ఇక్క‌డ నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఇప్పుడు.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌మిళ‌నాడులోనే మ‌కాం వేసి.. ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నా రు.

త‌మిళ‌నాడు సంస్కృతి, సంప్ర‌దాయాలు, భాష‌ను అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తివేదిక‌పైనా రాహుల్ కొనియాడుతున్నారు. అదేస‌మ యంలో హిందీ విష‌యంలో బీజేపీ అనుస‌రిస్తున్న విధానాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌డుతూ.. త‌మిళుల మ‌న‌సు గెలుచుకునే ప్ర‌య ‌త్నం చేస్తున్నారు. బీజేపీ.. తమిళ సంస్కృతిని, భాషను, చరిత్రను అణగదొక్కేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ఒకటే సంస్కృతి, ఒకటే భాష, ఒకటే భావన అనే మోదీ పన్నాగాన్ని తమిళ ప్రజలు ఓడిస్తారని రాహుల్ చెప్ప‌డం ద్వారా .. త‌మిళ ప్ర‌జ‌ల్లో గ‌ట్టిగా నాటుకునేందుకు రాహుల్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఇన్నాళ్లుగా లేనిది.. ఇప్ప‌టికిప్పుడు రాహుల్‌కు అటు కేర‌ళ‌, ఇటు త‌మిళ‌నాడుల‌పై ఎందుకు ప్రేమ వ‌చ్చింది.? ఎందుకు ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

ఆయా ప్ర‌శ్న‌ల‌ను కొంత ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో తీవ్ర ఎదురుగాలి ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. వ‌రుస‌గా మూడు సార్లు గెలిచిన అమేథీలో రాహుల గాంధీ నాలుగోసారి ఓడిపోయారు. ఇక‌, కొద్ది రోజుల కింద‌ట జ‌రిగిన బీహార్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఇక‌, యూపీలోనూ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. యూపీపై మోడీ త‌న‌దైన ముద్ర వేసుకుంటున్నారు. బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ ప‌రిణామాల‌తో కాంగ్రెస్ ఉత్త‌రాదిలో ఎదురు దెబ్బ‌లు తింటోంది. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణాది రాష్ట్రాల‌పై రాహుల్ పోక‌స్ పెంచార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌తంలో రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందుఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్ గ‌ట్టి ప‌ట్టుతో ఉంది. విభ‌జ‌న త‌ర్వాత‌.. ఏపీలో తుడిచి పెట్టుకుపోయినా.. కాంగ్రెస్‌కు సానుభూతి ఓటు బ్యాంకు ఉన్న నేప‌థ్యంలో కొంచెం శ్ర‌మిస్తే.. పుంజుకునే అవ‌కాశం ఉంది. ఇక‌, తెలంగాణ‌లో నాయ‌క‌త్వ కొర‌త వెంటాడుతోంది. ఈ స‌మస్య‌ను అధిగ‌మిస్తే.. బాగానే ఉంటుంది. అదేవిధంగా క‌ర్ణాట‌క‌లోనూ కాంగ్రెస్‌కు బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉంది. ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో.. ద‌క్షిణాదిలో కాంగ్రెస్ ను పుంజుకునేలా చేయాల‌నే వ్యూహాన్ని రాహుల్ అనుస‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదేస‌మ‌యంలో ఒక్క క‌ర్ణాట‌క‌లో మిన‌హా.. బీజేపీ మిగిలిన రాష్ట్రాల్లో చాలా వీక్‌గా ఉంది. ఈ ప‌రిస్థితిని అందిపుచ్చుకుంటే.. మున్ముందు ద‌క్షిణాది త‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని రాహుల్ భావిస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌మిళ‌నాడులో అప్పుడే ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించార‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.