జనాభిమానానికి కన్నీళ్లు.. భారత్ జోడో యాత్ర ముగింపులో రాహుల్ ఎమోషనల్

Mon Jan 30 2023 20:17:29 GMT+0530 (India Standard Time)

Rahul gets emotional at the end of the Bharat Jodo tour

ఒకటి కాదు.. రెండు కాదు.. వేల కిలోమీటర్లు.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ యాత్ర. దాదాపు 3 వేలకుపైగా ఈ యాత్ర కొనసాగింది.తమిళనాడులోని కన్యాకుమారిలో చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ కశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగిసింది. భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్ లో ముగింపు సభ నిర్వహించడం సైతం కష్టంగా మారిన వేళ ఎలాగోలా సభ నిర్వహణను చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు.



కశ్మీర్ లోని శ్రీనగర్ లో గల లాల్ చౌక్ లో రాహుల్ జాతీయ జెండా ఎగురవేశారు. ముగింపు సభలో ప్రసంగించారు. ‘తన యాత్ర ఎలా సాగిందో రాహుల్ గుర్తు చేసుకొని కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఎన్ని కష్టాలకోర్చి ఈ యాత్ర చేపట్టారో.. అందులో తనకు ఎదురైన అనుభవాలను రాహుల్ కాంగ్రెస్ శ్రేణులతో పంచుకున్నారు.

ఈ యాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పిందని రాహుల్ వెల్లడించారు. ప్రజల సహకారం చూసి తనకు కన్నీళ్లు వచ్చాయని.. ఓ దశలో యాత్ర పూర్తి చేయగలనా అని అనుకున్నట్లు రాహుల్ గుర్తు చేసుకున్నారు. ఈ యాత్రలో ప్రజల దీనస్థితి చూసి టీషర్టుతోనే యాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ తెలిపారు.

134 రోజుల పాటు భారత్ జోడోయాత్రలో తనకు ఎదురైన అనుభవాల్ని రాహుల్ వెల్లడించారు. కశ్మీర్ తన పూర్వీకుల స్వస్థలమని.. కానీ ఇప్పుడు కశ్మీర్ కష్టాల్లో ఉందని రాహుల్ తెలిపారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. అసలైన ప్రజాస్వామ్యం పునరుద్దరించాల్సి ఉందన్నారు. అందుకోసం తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

దేశవ్యాప్తంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం సంతోషంగా ఉందని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఇన్నివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జన స్పందన దగ్గరగా చూసిన రాహుల్ గాంధీ అభిమానానికి కన్నీళ్లు కార్చకుండా రాహుల్ ఉండలేకపోయారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.