తిరుగులేని అమేధీ కోటలో యువరాజు కు దెబ్బ తప్పదా?

Tue May 21 2019 10:28:47 GMT+0530 (IST)

Rahul Gandhi facing tough challenge in Amethi

ఎంత ఇష్టమైన వంట అయినా.. తినుబండారమైనా.. ఇంకేదైనా సరే.. అదే పనిగా తిన్నా.. అదే పనిగా ఉంచుకున్నా దాని మీద మొహమొత్తం మామూలే. ఇది మనిషి లక్షణం. దీనికి తోడు.. ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు.. ఒకసారి చూస్తే పోయేదేముందన్న భావన కలుగుతుంది. ఈ తీరే అమేధీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి భారీ షాక్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.గాంధీ కుటుంబానికి కంచుకోట మాదిరి ఉండే అమేధీలో ఈసారి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎదురుగాలి వీస్తోందన్న మాట బలంగా వినిపిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఓట్ల లెక్కింపు సీన్ గుర్తుకు తెచ్చుకుంటే.. కొన్ని రౌండ్లు రాహుల్ వెనుకబడిపోవటం..బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ముందంజలో రావటం ఆసక్తికరంగా మారటమే కాదు.. హాట్ టాపిక్ అయ్యింది.

అయితే.. ఆ అధిక్యత కొద్దిసేపు మాత్రమే ఉన్నా.. కాంగ్రెస్ వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిందని చెప్పాలి. అమేధీలో పోటీ చేసి ఓడిన స్మృతి ఇరానీకి బహుమానంగా కేంద్ర మంత్రి పదవి లభించటం.. అది కూడా కీలకమైన హెచ్ ఆర్డీ మినిస్ట్రీని సొంతం చేసుకోవటం తెలిసిందే. ఆ తర్వాత దాన్ని చేజార్చుకోవటం వేరే సంగతి అనుకోండి.

కేంద్రమంత్రి హోదాలోనూ తనను ఓడించిన అమేధీని వదలకుండా.. విడిచిపెట్టకుండా అదే పనిగా సందర్శించటం.. అక్కడి వారితో సంబంధాల్ని మెరుగుపర్చుకోవటంతో పాటు.. బలమైన క్యాడర్ ను ఏర్పాటు చేసుకోవటంపై దృష్టి పెట్టారు స్మృతి ఇరానీ.

ఇదే.. ఈ రోజున ఆమెకు సానుకూలంగా మారిందంటున్నారు. గతంతో పోలిస్తే.. ఈసారి రాహుల్ వర్సెస్ స్మృతి ఇరానీల మధ్య పోరు భీకరంగా ఉందంటున్నారు. తాజాగా విడుదలైన ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వివరాల్ని చూస్తే.. రాహుల్ కు అమేధీలో ఎదురుగాలి వీస్తోందన్న విషయాన్ని స్పష్టం చేయటం గమనార్హం.

2014లో జరిగిన ఎన్నికల్లో అమేధీలో రాహుల్ కు 4.08లక్షల ఓట్లు పోల్ కాగా.. ఆయన ప్రత్యర్థిగా బరిలో దిగిన స్మృతి ఇరానీకి 3లక్షల ఓట్లు నమోదయ్యాయి. తనకు ఎదురైన ఓటమిని వదిలేసి.. అమేధీలో కలివిడిగా తిరగటం.. 2019లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న కసితో పని చేయటం కూడా స్మృతికి లాభించే అవకాశం ఉందంటున్నారు. మరి.. ఈ అంచనా ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.