దురదృష్టవశాత్తూ ఎంపీనయ్యా.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు!

Fri Mar 17 2023 14:02:25 GMT+0530 (India Standard Time)

Rahul Gandhi Comments on His Post

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లండన్ లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం తగ్గకముందే మరోసారి ఆయన హాట్ కామెంట్స్ చేయడం గమనార్హం.



మార్చి 16న గురువారం రాహుల్ విలేకరులతో  మాట్లాడుతూ కొన్ని పదాలు తప్పుగా పలికారు. దీంతో కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు రాహుల్పై ధ్వజమెత్తుతున్నారు. పార్లమెంట్ వాయిదా పడిన అనంతరం రాహుల్ పాల్గొన్న మీడియా సమావేశానికి చెందిన ఒక వీడియో క్లిప్ వైరల్ గా మారింది.  అందులో రాహుల్ మాట్లాడుతూ..'దురదృష్టవశాత్తు.. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను' అని ఆయన అనడం కనిపిస్తోంది.

వెంటనే ఆ మాటల వెనక ఉన్న తప్పును గుర్తించిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్.. రాహుల్ వైపు వంగి వాటిని సరిచేశారు. 'దురదృష్టవశాత్తు నేను పార్లమెంట్ సభ్యుడినయ్యానని వారు జోక్ చేయగలరు' అని మార్చి చెప్పాలని జైరామ్ రమేష్ సూచించారు. అప్పుడు రాహుల్..'ఇక్కడ నేను మీకు ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. మీ దురదృష్టం కొద్దీ నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను' అంటూ బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే అప్పటికే రాహుల్ గాంధీ ముందు మాట్లాడిన వీడియో క్లిప్ ను బీజేపీ వైరల్ చేసేసింది.

దీనిపై కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ స్పందిస్తూ.. 'దురదృష్టవశాత్తు.. దీనిపై మాట్లాడటానికి మా దగ్గర పదాలు లేవు' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది నిజంగా దురదృష్టమంటూ మరో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వీడియోపై సెటైర్లు వేశారు.

కాగా ఈ విమర్శలపై జైరాం రమేశ్ స్పందిస్తూ..  మళ్లీ బీజేపీ తన ఫేక్ న్యూస్ మెషిన్కు పనిచెప్పిందని మండిపడ్డారు. రాహుల్ తన మాటలపై అప్పుడే స్పష్టత ఇచ్చారన్నారు. తాము ఎటువంటి టెలిప్రాంప్టర్లు లేకుండా మీడియాతో మాట్లాడతామని చెప్పారు. అదానీ కుంభకోణాన్ని పక్కదోవపట్టించేందుకు ఇది మరో ప్రయత్నం అంటూ మండిపడ్డారు.  

కాగా కొద్ది రోజుల క్రితం ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో 'భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది' అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా.. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.