నో హోదా... నో ఎంట్రన్స్ : రఘువీరా

Sun Jan 13 2019 11:17:58 GMT+0530 (IST)

Raghuveera Reddy Gives Clarity on About Andhra Special Status

కాంగ్రెస్ పార్టీ. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ. దేశంలో ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎంత వైభవ చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్లు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం విడిపోవడానికి ముందు తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. కొన్ని తరాలుగా కాంగ్రెస్ పార్టీకి మంచి నాయకత్వం కూడా ఉంది. ఇదంతా గతం. ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ దిక్కులేని... దిక్కు తెలియని పార్టీగా మిగిలింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ పార్టీ పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది. రాష్ట్రాన్ని రెండుగా విడదీసారనే ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ పేరు చెబితేనే మండిపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ ఆగ్రహాన్ని తగ్గించి పూర్వ వైభవం తెచ్చుకొవాలంటే ఏకైక మందు ప్రత్యేక హోదా అని గుర్తించింది కాంగ్రెస్ అధిష్టానం. అందుకే కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి వెళ్లినా తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.అది దుబాయ్ అయినా.... మారుమూల మడకశిర అయినా సరే.... పార్టీ జాతీీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయినా.... ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అయినా సరే అందరిదీ ఒకే మాట. అదే ప్రత్యేక హోదా బాట. ఇందుకోసం పెద్ద పండుగకు మందు పెద్ద ప్రమాణమే చేసేశారు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. "కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ఖాయం" అని రఘువీరారెడ్డి అనంతపురం జిల్లా మడకశిరలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తాను ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టననని శపథం చేశారు. "ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే మా స్వగ్రామం నీలకంఠాపురంలో సైతం అడుగుపెట్టను" అని ఆవేశంగా అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని... అవసరం తీరాక మాట మార్చి భారతీయ జనతా పార్టీ మోసం చేసిందని అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి రావడం ఖాయమని అలాగే ప్రత్యేక హోదా కూడా కచ్చితంగా ఇస్తామని రఘువీరా రెడ్డి ప్రకటించారు.