Begin typing your search above and press return to search.

జ‌న‌సేన గూటికి ఆర్ ఆర్ ఆర్‌? ఈ కామెంట్ల మ‌ర్మ‌మేంటి?

By:  Tupaki Desk   |   12 Jan 2022 1:30 PM GMT
జ‌న‌సేన గూటికి ఆర్ ఆర్ ఆర్‌?  ఈ కామెంట్ల మ‌ర్మ‌మేంటి?
X
రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఎవ‌రు ఏ పార్టీకి అనుకూలంగా మార‌తారో.. ఎవ‌రు ఏ పార్టీకి వ్య‌తిరేకంగా మార‌తారో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. 2019లో వైసీపీ నుంచి పార్ల‌మెంటు టికెట్ సంపాయించుకున్న ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్ అత్యంత త‌క్కువ స‌మ‌యంలో ఆ పార్టీకి బ‌ద్ధ శ‌త్రువుగా మారిపోయారు. తెర‌వెనుక ఏం జ‌రిగిందో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ, ప్ర‌భుత్వ విధానాల‌ను వ్య‌తిరేకించ‌డంతో త‌న‌ను బ‌లిప‌శువును చేశారంటూ.. ఆర్ ఆర్ ఆర్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. పార్టీ కూడా త‌న ఎంపీపై వేటు వేయాలంటూ.. పార్ల‌మెంటు స్పీక‌ర్‌కు విన్న‌వించింది. పార్టీలోనూ ఆయ‌న‌ను దూరం పెట్టారు.

అంతేకాదు.. సోష‌ల్ మీడియాలోనూ ఆర్ ఆర్ ఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఇక‌, ఆర్ ఆర్ ఆర్ కూడా ప్ర‌భుత్వ విధా నాల్లోని డొల్ల‌త‌నాన్ని.. దాదాపు రెండేళ్లుగా ఎండ‌గ‌డుతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీజేపీలోకి వెళ్తార‌ని.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో ఆయ‌న ట‌చ్‌లో ఉన్నార‌ని.. వైసీపీ ప్ర‌చారం చేసింది. ఇక‌, ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజీనామాకు కూడా పార్టీ నేత‌లు డిమాండ్ చేశారు. ఇక‌, ఈ విష‌యంలో ఫిబ్ర‌వ‌రి 5 డెడ్‌లైన్ విధించిన ర‌ఘురామ‌.. ఆ వెంట‌నే ఎన్నిక‌ల‌కు వెళ్తాన‌ని కూడా ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తి రాజ‌ధాని అజెండాతో తాను ఎన్నిక‌ల‌కు వెళ్తానంటూ.. సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న ఏపార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌బోతున్నారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. అయితే.. బీజేపీ, లేక‌పోతే.. టీడీపీ ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక దాని నుంచి ర‌ఘురామ పోటీ చేస్తార‌ని.. రాజ‌కీయ పండితులు భావించారు. ఎందుకంటే.. కేంద్రంలో బీజేపీ పెద్ద‌ల‌తో ఆయ‌న ట‌చ్‌లో ఉన్నారనే వాద‌న ఉంది. ఇక‌, ఇటీవ‌ల అమ‌రావ‌తి పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబు తో కలిసి వేదిక‌ను పంచుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చంద్ర‌బాబుకు కూడా ట‌చ్‌లో ఉన్నార‌నే వాద‌న బ‌ల‌ప‌డింది. ఈ క్ర‌మంలో ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్తార‌నే చ‌ర్చ సాగింది.

అయితే.. అనూహ్యంగా ర‌ఘురామ చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. ఆయ‌న జ‌న‌సేన తీర్థం పుచ్చుకుంటారా? అనే సందేహాలు రాజ‌కీయ తెర‌మీద‌కి వ‌చ్చాయి. రఘురామ కృష్ణరాజు తాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఐడీ అధికారులు తనకు నోటీసులు ఇచ్చి వెళ్లిన అనంతరం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను పవన్ కల్యాణ్ అభిమాని అని చెప్పారు. 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడిని' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.