Begin typing your search above and press return to search.

ఏపీ సీఐడీ చీఫ్ పై ఢిల్లీ పోలీసులకు రఘురామ ఫిర్యాదు

By:  Tupaki Desk   |   6 Jun 2021 3:50 AM GMT
ఏపీ సీఐడీ చీఫ్ పై ఢిల్లీ పోలీసులకు రఘురామ ఫిర్యాదు
X
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీ నుంచి రాజకీయం మొదలుపెట్టారు. బెయిల్ వచ్చిన తర్వాత ఢిల్లీకి మకాం మార్చిన ఆయన తాజాగా తనను అరెస్ట్ చేసిన ఏపీ సీబీసీఐడీపై పడ్డారు. ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఏపీ సీబీసీఐడీ పోలీస్ చీఫ్ సునీల్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఆయన మీడియాకు విడుదల చేశారు. మే 14న తనను ఏపీ సీఐడీ అధికారులు గచ్చిబౌలిలోని ఎంపీ రఘురామ ఇంటినుంచి అరెస్ట్ చేశారని ఆ సమయంలో తన విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. నా ఐఫోన్ 11 మోడల్ ను తీసుకున్నారని.. దాని సిమ్, వాట్సాప్ ను కూడా నా అనుమతి లేకుండా ఓపెన్ చేసి చూశారని.. తన కీలక మైన సమాచారాన్ని అంతా చోరీ చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.

నా ఫోన్ నంబర్ల నుంచి ఇతరులకు వాట్సాప్ మెసేజ్ లు చేస్తున్నారని.. సీఐడీ పోలీసుల వద్దనున్న నా ఫోన్ ను తిరిగి ఇప్పించాలని ఫిర్యాదులో ఎంపీ రఘురామ కోరారు.రిటైర్డ్ ఐఏఎస్, సీఎం సలహాదారుగా చేసిన పీవీ రమేశ్ కు నా సెల్ ఫోన్ నంబర్ నుంచి తప్పుడు మెసేజ్ లు పెడుతున్నారని.. ఆ ట్వీట్లకు తనకు సంబంధం లేదని రఘురామ వివరణ ఇచ్చారు. నా ఫోన్ ఏపీ సీఐడీ పోలీసుల వద్దే ఉందని.. వారే చర్యలు తీసుకోవాలని కోరారు.

ఒక ఎంపీ విషయంలో నిబంధనలు పాటించకుండా వ్వహరించిన తీరు.. తన ఫోన్ ను తిరిగి ఇవ్వని నేపథ్యంలో సీఐడీ చీఫ్ సునీల్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని.. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్.. పీవీ రమేశ్ చెల్లెలి మధ్ కుటుంబ పరమైన విభేదాలు ఉన్నానే విషయం తన దృష్టికి వచ్చిందని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కేసు ఒకటి హైకోర్టులో పెండింగ్ లో ఉందని వివరించారు. సీఐడీ ఆధ్వర్యంలో ఉన్న తన మొబైల్ నంబర్ నుంచి పీవీ రమేశ్ కు మెసేజ్ లు వెళ్లడం వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిందని రఘురామ తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.