జగన్ బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టుకు ఆర్ ఆర్ ఆర్.. ఏం జరిగింది?

Tue Sep 14 2021 14:45:13 GMT+0530 (IST)

RRR to Telangana High Court on cancellation of Jagan bail

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ.. కొన్నాళ్ల కిందట హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది కూడా మరో 24 గంటల్లో.. ఈ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరిం చనున్న నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.ఏం జరిగింది?

అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ దాదాపు 11 సంవత్సరాల కిందట నమోదు చేసిన కేసుల్లో.. వైసీపీ అధినేత జగన్ కొన్నాళ్లు జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బెయిల్ పొందారు. తర్వాత ఏపీలో అధికారం లోకి కూడా వచ్చారు. అయితే.. ఈ క్రమంలో గతంలో ఆయన కేసుల్లో ఉన్న కొందరు అధికారులకు ఏపీలో ప్రాధాన్యం పోస్టుల్లో నియమించారు. దీనిని ప్రశ్నిస్తూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.

వాదనలు ఇవీ..

ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్.. తన కేసులకు సంబంధించి.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ లో అభ్యర్థించారు. దీనిపై జరిగిన విచారణలో సీబీఐ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. జగన్ బెయిల్ రద్దుపై కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు. అయితే ఆర్ ఆర్ ఆర్ దాఖలు చేసిన పిటిషన్ కేవలం రాజకీయ కుట్రలో భాగమని.. దీనిని పరిశీలించాల్సిన అవసరం లేదని.. జగన్ తరఫున లాయర్లు కోర్టుకు వివరించారు. దీంతో.. జగన్ బెయి ల్ రద్దుపై ఉత్కంఠ ఏర్పడింది.

సంచలన నిర్ణయం..

ఇక దీనిపై మరో 24 గంటల్లో తీర్పు వెలువడుతుందనగా.. ఆర్ ఆర్ ఆర్.. తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎం జగన్ విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ.. తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. సీబీఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుం డా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని రఘురామ కోరటంతో.. ఈ రోజు విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. అయితే.. అనూహ్యంగా ఆర్ ఆర్ ఆర్ యూటర్న్ తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎందుకిలా?

సీబీఐ కోర్టు బెయిల్ రద్దుపై తీర్పు వెలువరించకుండానే.. జగన్ సొంత మీడియా సాక్షికి చెందిన ట్విట్టర్‌లో బెయిల్ రద్దు పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చిందంటూ.. కొన్ని రోజుల కిందట వార్త వచ్చింది. అయితే.. దీనిని కొద్ది సేపటికి తొలగించారు. అయితే.. ఇది కోర్టు ధిక్కారం కింద చూడాలంటూ.. ఆర్ ఆర్ ఆర్ అదే సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన కోర్టు.. జగన్ తరఫున లాయర్ల వాదన.. ``అది ఉద్దేశ పూర్వకంగా చేసిన తప్పుకాదు. ఒక ఉద్యోగి చేసిన తప్పిదం`` అని పేర్కొన్నారు. దీంతో సదరు పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో రేపు సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పు కూడా దీనిపై ప్రభావితం అవుతుందని.. తాను భావిస్తున్నట్టు రఘురామ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విచారణ బెంచ్‌ను మార్చాలని ఆయన అభ్యర్థిస్తూ.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.