పిటీషన్ పై ఎంపి నమ్మకం కోల్పోయారా ?

Sat Jul 31 2021 11:27:04 GMT+0530 (IST)

Did the MP lose faith in the petition?

జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు విషయంలో తన నమ్మకానికి విరుద్దంగా తీర్పువస్తే వెంటనే హైకోర్టులో పిటీషన్ వేస్తానని వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు చెప్పారు. సీబీఐ కోర్టులో తన పిటీషన్ పై వాదనలు ముగిసిన విషయాన్ని మీడియాతో మాట్లాడారు. తన పిటీఫన్ పై జరిగిన విచారణ ఆధారంగా జగన్ బెయిల్ రద్దవుతుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. ఒకవేళ తన నమ్మకానికి విరుద్ధంగా తీర్పువస్తే వెంటనే హైకోర్టుకు వెళతానన్నారు.ఒకవేళ హైకోర్టులో కూడా వ్యతిరేకంగా తీర్పువస్తే మళ్ళీ సుప్రింకోర్టులో కేసు వేస్తానని స్పష్టంగా ప్రకటించారు. అంటే ఎంపి చెప్పిందాన్నిబట్టి రెండు విషయాలో అర్ధమవుతోంది. మొదటిదేమో తాను దాఖలుచేసిన కేసులో జగన్ బెయిల్ రద్దవుతుందని ఎంపిలో నమ్మకం సడలిపోయింది. ఇక రెండోదేమంటే జగన్ కు వ్యతిరేకంగా కోర్టుల్లో పోరాడుతునే ఉంటారని. తనపైన సీఐడీ పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేయటాన్ని కక్షసాధింపుగా ఎంపి వ్యవహరిస్తున్నారు.

ఇదే సమయంలో జగన్ కు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటం మాత్రం న్యాయంకోసమట. అసలు జగన్ పై జరుగుతున్న అక్రమాస్తుల కేసుల విచారణలో ఎంపికి ఎలాంటి సంబంధంలేదు. అయినా జోక్యం చేసుకుని బెయిల్ రద్దుకు ఎంపి కేసువేశారు. ఎంపికి మద్దతుగా చంద్రబాబునాయుడు అండ్ కో నిలబడటమే ఆశ్చర్యంగా ఉంది. ఎంపికే సంబంధంలేదంటే ఇక చంద్రబాబుకు ఏమి సంబంధం ఉంటుంది.

అయితే ఇక్కడ ఎంపి మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమంటే బెయిల్ రద్దు విషయంలో సీబీఐ కోర్టు తనకు అనుకూలంగా తీర్పివ్వకపోతే హైకోర్టుకు అక్కడినుండి సుప్రింకోర్టుకు వెళతానని చెప్పారు. ఒకవేళ బెయిల్ రద్దయితే దాన్ని వ్యతిరేకిస్తు హైకోర్టు తర్వాత సుప్రింకోర్టుకు వెళ్ళే అవకాశం జగన్ కూ ఉంది కదా. తనకెన్ని అవకాశాలున్నాయో జగన్ కూ అన్ని అవకాశాలున్నాయన్న విషయాన్ని ఎంపి ఎలా మరచిపోయారు. ఒక ఎంపి హోదాలోనే రఘురామ సీఎంకు వ్యతిరేకంగా పోరాడుతున్నపుడు సీఎం హోదాలో జగన్ ఎంపికి వ్యతిరేకంగా పోరాడలేరా ?