మోడీపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

Sun May 02 2021 21:02:05 GMT+0530 (IST)

RGV sensational comments on Modi

దేశంలో కొవిడ్ కేసులు లక్షలాదిగా పెరిగిపోతున్నాయి. బాధితులు వేలాదిగా చనిపోతున్నారు. ఈ విషయంలో మొదట్నుంచీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ప్రధాని మోడీపై డైరెక్ట్ అటాక్ చేశారు.‘‘దేశవ్యాప్తంగా అద్భుతమైన హారర్ విజువల్స్ ఇచ్చినందుకు నరేంద్రమోదీ మీకు థాంక్స్. మీరు ఎప్పుడైనా మీ ప్రధాని పదవి కోల్పోతే.. F**k ఇండియా అని మీరు అనడానికి అవకాశం ఉంది. ఎందుకంటే.. ప్రపంచంలోనే మీరు నెంబర్ వన్ హారర్ ఫిల్మ్ డైరెక్టర్’’ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా కొనసాగిస్తూ.. ‘‘సార్ నరేంద్రమోదీజీ.. నాకు నేను డీసెంట్ హారర్ ఫిల్మ్ మేకర్ అనుకుంటాను. కానీ.. మీరు త్వరలోనే రూపొందించబోయే హారర్ ఫిల్మ్ కోసం నాకు స్పాట్ బాయ్ ఉద్యోగాన్ని ఇవ్వాలని విన్నవించుకుంటున్నాను. థర్డ్ వేవ్ సమయంలో కౌంటింగ్ డిపార్టమెంట్ లోనైనా నాకు క్లర్క్ జాబ్ ఇస్తే.. మృతదేహాలను లెక్కించే పనిచేస్తాను. ఎందుకంటే.. మృతదేహాలంటే మీకంటే నాకే ఎక్కువ ఇష్టం’’ అంటూ ఘాటైన పోస్టు చేశారు వర్మ.

ఇక తన ట్వీట్లో సోనియా గాంధీకి సారీకూడా చెప్పారు ఆర్జీవీ. నరేంద్రమోదీ ఓ మృత్యువ్యాపారి అంటూ 2014లో సోనియా గాంధీ ఆరోపణలు చేస్తే.. నాకు అప్పుడు సరిగా అర్థం కాలేదు. ఆమెకు అంత గొప్ప విజనరీ ఉంటుందని నేను ఊహించలేదు. అందుకు నేను బేషరతుగా సోనియా గాంధీకి క్షమాపణ చెబుతున్నాను. వీలైతే.. మీ కాళ్లను ఫొటో తీసిపంపితే డిజిటల్ రూపంలో తాకి మొక్కుతాను’’ అని వర్మ ట్వీట్ చేశారు.

గతంలో.. కుంభమేళాపై విమర్శలు గుప్పించారు ఆర్జీవీ. దాదాపు 6 లక్షల మంది కుంభమేళాలో పాల్గొని స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. అప్పటికే తీవ్రంగా ఉన్న కరోనా.. ఆ తర్వాత మరింత విజృంభించింది. కుంభమేళాలలో పాల్గొన్న పలువురు కొవిడ్ బారిన పడ్డారు కూడా. ఈ విషయమై పలు ట్వీట్లు చేసిన ఆర్జీవీ.. తాజాగా మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆర్జీవీ కామెంట్లు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.