Begin typing your search above and press return to search.

తగ్గిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.. కీలక నివేదిక విడుదల చేసిన ఆర్ బీఐ

By:  Tupaki Desk   |   31 May 2023 9:58 AM GMT
తగ్గిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.. కీలక నివేదిక విడుదల చేసిన ఆర్ బీఐ
X
మోడీ సర్కారు కు ఇబ్బందిగా మారే నివేదిక ఒకటి విడుదలైంది. భారత రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదిక లో దేశానికి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. 2021-22తో పోలిస్తే 2022-23లో దేశానికి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 20 శాతం మేర తగ్గిన విషయాన్ని వెల్లడించింది. తొమ్మిదేళ్ల క్రితం దేశంలోని పాతిక రంగాల్లోకి ప్రారంభమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కు సంబంధించిన రిపోర్టు ను విడుదల చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే 2014-15లో 45.5 బిలియన్ డాలర్ల తో ప్రారంభమైన ఈ పెట్టుబడులు 2016-17లో రికార్డు స్థాయిలో 60.22 బిలియన్ డాలర్లు కాగా.. ఐదేళ్లలో మాత్రం హెచ్చుతగ్గులు నమోదు అవుతున్న పరిస్థితి. 2018-19లో 44.4 బిలియన్ డాలర్ల పెట్టబడులు రాగా.. ఆ తర్వాతి ఏడాది 50 బిలియన్ డాలర్ల కు పెరిగాయి. 2020-21 లో అనూహ్యంగా పెరిగి 2016-17 మార్కుకు దగ్గర గా (59.6 బిలియన్ డాలర్లు) వచ్చాయి. క2021-22 లోనూ 58.8 బిలియన్ డాలర్లుగా నమోదు అయినప్పటికీ.. గత మార్చిలో మాత్రం ఈ పెట్టుబడుల్లో భారీ క్షీణత నమోదు కావటం గమనార్హం.

గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మాత్రం 46 బిలియన్ డాలర్లు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో వచ్చినట్లుగా ఆర్ బీఐ పేర్కొంది. దీనికి కారణం ఏమిటన్న విషయాని కి వస్తే.. ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వ్యాప్తంగా స్లో డౌన్ గా ఉండటం.. మార్కెట్ లో డిమాండ్ లేకపోవటం కారణంగా చెబుతున్నారు. దీని కి తోడు ఉత్పత్తి పెరిగే అవకాశాలు లేకపోవటం కూడా భారత్ లో ఎఫ్ డీఐలు తగ్గటానికి కారణాలుగా చెబుతున్నారు.

పద్నాలు గు రంగాల్లో ముఖ్యంగా మొబైల్స్.. ఎలక్ట్రానిక్ పరికరాల ఇండస్ట్రీ కి సంబందించి ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహకాలు ఇవ్వటం విజయవంతం కాలేదన్న మాట వినిపిస్తోంది. మౌలిక సదుపాయాలు మెరుగు పడకపోవటం.. రవాణా సౌకర్యాలు పెరగకపోవటం.. లాజిస్టిక్స్ ఖర్చుపెరగటం లాంటివి ప్రభావితం చూపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వియత్నాం.. బంగ్లాదేశ్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నట్లుగా ఆర్థిక రంగానికి చెందిన ప్రముఖులు చెబుతున్నారు.

అంతకు ముందుఏడాదితో పోలిస్తే గత ఏడాదిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తాయారీ రంగంలో భారీగా తగ్గగా.. ఆర్థిక సేవల రంగంలో పెరిగాయి. కంప్యూటర్ సేవల రంగంలోనూ తగ్గుదల నమోదైంది. కమ్యూనికేషన్ల రంగం లోనూ తక్కువగానే ఉంది. ఇంధనరంగంలో మాత్రం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. గత ఏడాది పెరిగినట్లుగా గుర్తించారు.

మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మన దేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాలు పెద్దగా ముందుకు రావటం లేదన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 2019-20లో 0.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. గత ఏడాది ఈ రంగంలో కేవలం 0.1 బిలియన్ డాలర్లు మాత్రమే రావటం గమనార్హం.