Begin typing your search above and press return to search.

వణికిస్తున్న మాంద్యం భయాల వేళ.. ఆర్ బీఐ అభయహస్తం

By:  Tupaki Desk   |   22 March 2023 10:47 AM GMT
వణికిస్తున్న మాంద్యం భయాల వేళ.. ఆర్ బీఐ అభయహస్తం
X
ప్రపంచీకరణ పుణ్యమా అని యావత్ ప్రపంచం కుగ్రామంగా మారిపోవటం. ఎక్కడో సదూరాన ఉన్న అమెరికాలో గడ్డు పరిస్థితులు ఎదురైతే.. దాని ప్రభావం ఆ వెంటనే మనమీద పడటం తెలిసిందే. అమెరికాలోనే కాదు.. ప్రపంచంలోని ఏ మారుమూల దేశంలో చోటు చేసుకునే పరిణామానికి అంతో ఇంతో ప్రభావం పడే పరిస్థితి ఇప్పుడుంది. గడిచిన కొద్ది నెలలుగా మాంద్యం భయాందోళనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

వరుస పెట్టి కంపెనీలు ప్రకటిస్తున్న ఉద్యోగాల తీసివేతలతో ఆ భయాలు మరింత పెరుగుతున్నాయి. పశ్చిమ దేశాల్లో మొదలైన మాంద్యం చిచ్చు.. మనల్ని కూడా ముంచెత్తుతోందన్న భయాల నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) కీలక ప్రకటన చేసింది. ఊరట కలిగించేలా ఉన్న ఈ సమాచారం.. కొంతలో కొంత ఊరట కలిగిస్తుందని మాత్రం చెప్పక తప్పదు. అన్నింటికి మించి తీపికబురును చెప్పుకొచ్చింది.

తాజాగా విడుదల చేసిన వ్యాసంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తరహాలో భారత్ మాంద్యం బారిన పడదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

అంతేకాదు.. తాజా ఆర్థిక సంవత్సరంలోనూ వృద్ధి వేగాన్ని కొనసాగిస్తామన్న ధీమాను వ్యక్తం చేసింది ఎన్ని అడ్డంకులు ఉన్నా.. భారత్ వృద్ధిపైన సానుకూలంగా ఉన్నట్లుగా పేర్కొన్న తాజా బులిటెన్ భారీగా ఊరటను ఇస్తుందని చెప్పక తప్పదు.

తన వాదనకు బలం చేకూరేలా జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన గత నెల గణాంకాల్ని ఈ సందర్భంగా ఉటంకించింది. ఫిబ్రవరి నెలలో నమోదైన గణాంకాల్ని పరిశీలిస్తే.. పలు దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని వెల్లడించింది. కొవిడ్ పరిణామాల అనంతరం కోలుకోవటంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికం నుంచి వృద్ధి స్థిరంగా కొనసాగటాన్ని ప్రస్తావించింది.

ప్రపంచం మొత్తం సవాలుతో కూడిన వాతావరణంలోకి ప్రవేశిస్తున్నా.. మనకు మాత్రం అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేసిన ఆర్ బీఐ.. దేశీయ అంశాలు బలమైన విశ్వాసంతో ఉన్నట్లు చెప్పింది. 2023 అంతర్జాతీయ వృద్ధి రేటు ఒత్తిడికి గురి అవుతున్నా.. మనకు మాత్రం అలాంటి ఇబ్బంది లేదంటూ.. "అంతర్జాతీయంగా మాంద్యంలోకి ప్రవేశిస్తున్నా.. భారత్ మాత్రం అంచనా వేసిన దాని కంటే బలంగా ఉండనుంది" అని పేర్కొన్న వైనం చూసినప్పుడు కొండంత విశ్వాసం గుండెల నిండుగా ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.