Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ ఎఫెక్ట్‌.. ఏపీకి కేంద్రం షాక్‌!

By:  Tupaki Desk   |   28 Nov 2021 2:30 AM GMT
ఆర్ ఆర్ ఆర్ ఎఫెక్ట్‌.. ఏపీకి కేంద్రం షాక్‌!
X
ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి గ‌ట్టి షాక్ త‌గిలింది. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. కొన్నాళ్ల కింద‌ట చేసిన ఫిర్యాదు మేరకు తాజాగా కేంద్రం రియాక్ట్ అయింది. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. పీవీ హ‌యాంలో ఏర్పాటు చేసిన ఎంపీ లాడ్స్ నిధులను ఏపీలో అధికార వైసీపీ ఎంపీలు దుర్వినియోగం చేస్తున్నార‌ని.. ఒక మ‌తానికి అనుకూలంగా ఈ నిధుల‌ను ఖ‌ర్చు చేస్తున్నార‌ని.. ఆర్ ఆర్ ఆర్ ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా.. కేంద్రం రియాక్ట్ అయింది. ఏం జ‌రుగుతోంది? నిధుల‌ను ఏం చేస్తున్నారో.. చెప్పాలంటూ.. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

చర్చిలకు ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యకార్యదర్శికి లేఖలు పంపింది. ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం పీఎంవోకు వివరాలు ఇవ్వాల్సి ఉన్నందున తక్షణమే నివేదిక పంపాలని ఆదేశాల్లో పేర్కొంది. చర్చికి నిధుల కేటాయింపుపై ఇటీవల ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. నివేదిక ఇవ్వాలని రాష్ట్రాన్ని 2 నెలల క్రితమే లేఖ రాసింది.

కానీ, ఏపీ సర్కార్ స్పందించకపోవడంతో కేంద్ర గణాంకాల శాఖ మరోసారి ఈ లేఖలు రాసింది. ఏపీలో ఎంపీలాడ్స్ నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలంటూ గతంలోనే కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. నిబంధనల అనుగుణంగా ఎంపీలాడ్స్ నిధులు ఖర్చు చేయకపోవటంపై వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రణాళికా విభాగం ముఖ్యకార్యదర్శికి కేంద్రం ఈ లేఖ పంపింది. మతపరమైన భవనాల నిర్మాణానికి, మరమ్మతుల కోసం ఎంపీలాడ్స్ నిధులు కేటాయించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వివరణ కోరుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి.