Begin typing your search above and press return to search.

దేవుడా... ఢిల్లీ గల్లీ గ్యాంగ్ కి పుష్ప ఇన్ స్పిరేషనా?

By:  Tupaki Desk   |   22 Jan 2022 5:07 AM GMT
దేవుడా... ఢిల్లీ గల్లీ గ్యాంగ్ కి పుష్ప ఇన్ స్పిరేషనా?
X
ఎవరేం చెప్పినా.. సినిమా ప్రజల మీద చూపే ప్రభావం ఎంతో. ఈ విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. మంచి త్వరగా వ్యాప్తి చెందదు కానీ.. చెడు మాత్రం కరోనా వైరస్ మాదిరి దూసుకెళుతూ ఉంటుంది. తాజాగా ఈ మాటలో నిజం ఎంతన్న విషయాన్ని తెలియజేసే ఉదంతం ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. చాలా సినిమాల్లో.. ఆ మూవీ స్టార్ట్ కావటానికి ముందు.. ‘ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించనవి కావు.. కేవలం కల్పితాలేనని చెప్పటం.. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి అనుకరించకండి’ అంటూ చట్టబద్ధమైన హెచ్చరికను చేసినా.. సినిమాల్లో తాము చూసిన సీన్లకు విపరీతమైన స్ఫూర్తిని పొందే వారు.. రియల్ లైఫ్ లో ఎలా చేస్తారనటానికి ఈ ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పక తప్పదు.

న్యూఢిల్లీలోని జహంగీర్ పురిలో జరిగిన ఒక హత్య కేసు విచారణను చేపట్టిన పోలీసులకు షాకిచ్చే అంశాలు వెల్లడయ్యాయి. ఈ నేరానికి పాల్పడిన నిందితులు.. తాము ‘పుష్ప-ది రైజ్’ మూవీతోపాటు..ఒక ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద అందుబాటులోఉన్న ఒక వెబ్ సిరీస్ స్ఫూర్తితో నేరాలు చేస్తున్నట్లుగా చెప్పటం గమనార్హం. ఈ దారుణ హత్యకు పాల్పడిన ముగ్గురు టీనేజర్లు కావటం మరో షాకింగ్ అంశంగా చెప్పాలి. ఈ నిందితులు ముగ్గురు.. తాము ఢిల్లీలోని ఒక మస్తీలో ఉంటామని పేర్కొన్నారు.

‘బద్నాం’ పేరుతో తాము ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నామని.. స్థానికంగా తాము పాపులర్ కావాలని.. తాము చేసే ఎదవ పనులతో దాదాగిరి ఇమేజ్ ను సొంతం చేసుకోవాలన్నది వారి లక్ష్యం. దీనికి సదరు వెబ్ సిరీస్ తో పాటు.. పుష్ప ది రైజ్ సినిమా స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తాము ఇతరులకు దమ్కీ ఇచ్చే వైనాల్ని వీడియోలుగా తీసి.. ఇన్ స్టాలో పోస్టు చేస్తుంటారు. పుష్ప మూవీ సినిమా చూసిన తర్వాత.. అందులో హీరో మాదిరితాము కూడా ఎదగాలని భావించిన వారు.. తమ వైపు నుంచి వెళుతున్నఒక అమాయకుడ్ని టార్గెట్ చేశారు.

ఆ యువకుడ్ని చావబాదుతూ.. దానికి సంబంధించిన వీడియోను రికార్డు చేశారు. వారి కొట్టే దెబ్బల్నిచూసిన స్థానికులు.. వారిని చెదరగొట్టి.. ఆ కుర్రాడ్ని రక్షించారు. అనంతరం అతడ్నిఆసుపత్రిలో చేర్చారు. బాధితుడి నుంచి సేకరించిన సమాచారం.. సీసీ కెమేరాల ఫుటేజ్ ఆధారంతో ఈ దారుణమైన పనికి పాల్పడింది.. ‘బద్నాం’ గ్యాంగ్ అని గుర్తించి..వారిని అరెస్టు చేశారు.

అనంతరం వారిని విచారించే క్రమంలో.. వెబ్ సిరీస్ తో పాటు.. ఈ మధ్య విడుదలైన సూపర్ డూపర్ హిట్ అయిన ఫుష్ప మూవీలో హీరోలా ఎదగాలన్న ఉద్దేశంతో తామీ పని చేసినట్లుగా చెప్పటంతో షాక్ తినటం పోలీసుల వంతైంది. సినిమాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్నది తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.