Begin typing your search above and press return to search.

దగ్గరకు వెళ్లి మరీ పంచ్ లు వేయించుకున్న కేటీఆర్

By:  Tupaki Desk   |   3 Feb 2023 4:00 PM GMT
దగ్గరకు వెళ్లి మరీ పంచ్ లు వేయించుకున్న కేటీఆర్
X
ఈ రోజు (శుక్రవారం) నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలుప్రారంభమైన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలు గవర్నర్ తమిళ సై ప్రసంగంతో మొదలయ్యాయి. అందరి ఉత్కంటకు పుల్ స్టాప్ పెడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని చదివేశారు గవర్నర్ తమిళ సై.

తాను సూచించిన సూచనలకు కేసీఆర్ సర్కారు ఓకే చెప్పటంతో.. ప్రభుత్వం ఇచ్చిన పాఠాన్ని చదవటానికి గవర్నర్ పెద్దగా సంకోచించలేదు. ఇదిలా ఉంటే.. గవర్నర్ ప్రసంగానికి ముందు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్.. రఘునందన్ రావు.. రాజాసింగ్ ల వద్దకు మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా రావటం అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఆ సందర్భంగా వారంతా కాసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్ లో జరిగి అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదని ఈటలను మంత్రి కేటీఆర్ ప్రశ్నించగా.. పిలిస్తేకదా హాజరయ్యేది అన్నట్లుగా సమాధానం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

మంత్రి కేటీఆర్ - ఈటల మధ్య సంభాషణ జరుగుతుండగా.. అక్కడకు వచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. వారితో మాటలు కలిపిన సందర్భంగా.. తనను కూడా అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించటం లేదని భట్టి చెప్పగా.. ఈటల కల్పించుకొని.. కనీసం అధికారిక కార్యక్రమాలకు కలెక్టర్ నుంచైనా ఆహ్వానం ఉండాలని చెప్పగా.. కేటీఆర్ నవ్వి ఊరుకున్నారే తప్పించి మాట్లాడలేదు.

ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వేసుకున్న కాషాయ రంగు చొక్కాను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి కేటీఆర్.. ఆ రంగు తనకు ఇష్టం ఉండదని.. చొక్కా రంగు కళ్లకు గుచ్చుకుంటుందనగా.. భవిష్యత్తులో మీరూ ఆ చొక్కా వేసుకోవాల్సి వస్తుందేమో? అంటూ వ్యాఖ్యానించారు. దీనికి కేటీఆర్ నుంచి సమాధానం రాలేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇలాంటి సంభాషణ సాగుతున్న వేళలో.. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి.. గవర్నర్ వస్తున్నారని చెప్పటంతో తన సీటు వద్దకు వెళ్లిపోయారు. ఇదంతా చూస్తే.. దగ్గరకు వచ్చి మరీ కదిలించుకొని కౌంటర్లు వేయించుకొని కేటీఆర్ వెళ్లినట్లుగా మాట్లాడుకోవటం కనిపించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.