జడ్జిలను పరుష పదజాలంతో దూషించే పంచ్ ప్రభాకర్ దావోస్ లో ప్రత్యక్షం

Thu May 26 2022 10:19:34 GMT+0530 (IST)

Punch Prabhakar At Davos

నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. మనసుకు తోచినట్లుగా దూషించటం.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా చివరకు గౌరవనీయ స్థానంలో ఉండే న్యాయమూర్తులను సైతం దారుణంగా దూషించే పంచ్ ప్రభాకర్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. పలు కేసుల్లో నిందితుడిగా వ్యవహరిస్తూ.. ఆయన్ను అరెస్టు చేయాలని పలు కోర్టులు సీబీఐకి ఆదేశాలు జారీ చేసినా పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేయలేని పరిస్థితి. అలాంటి ఆయన తాను ఉండే అమెరికాను వదిలి.. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు కావటం విశేషం.అంతే కాదు.. ఆయన ఏపీ మంత్రి మిథున్ రెడ్డితో కలిసి ఫోటో దిగటం.. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన వ్యాపార అవసరాల కోసం తాను దావోస్ వెళ్లినట్లుగా పేర్కొన్న పంచ్ ప్రభాకర్.. తాను ఏపీకి చెందిన కార్యదర్శుల్ని కలిసినట్లుగా పేర్కొన్నారు. తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పెవిలియన్ పెట్టారని.. అందులో రోజు ఐదారు గంటల పాటు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి వివరిస్తున్నట్లు పేర్కొన్నారు.

తాను తన వ్యాపార అవకాశాల కోసం ఏపీకి చెందిన పలువురిని కలవటానికి పెవిలియన్ వెళ్లినట్లుగా చెప్పారు. 'అన్ని విషయాల్లోనూ మంచే జరుగుతుంది. అందుకే జగన్ ను కలవాలని ఆయన అభిమానులు చాలామంది వచ్చారు' అంటూ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

న్యాయమూర్తుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం.. న్యాయ వ్యవస్థపై దూషణలు చేయటం లాంటి పలు కేసులు ఎదుర్కొంటున్న ఆయన్ను అదుపులోకి తీసుకోవాల్సిందిగా కోర్టు సీబీఐకు ఆదేశాలు జారీ చేశాయి. అయినప్పటికీ ఆయన్ను అదుపులోకి తీసుకునే విషయంలో సీబీఐ కోర్టు ఆదేశాల్ని ఇంతవరకు అమలు చేయలేదు.

తనకు నచ్చని వారిపై దారుణంగా వ్యాఖ్యలు చేసే పంచ్ ప్రభాకర్..వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ సపోర్టర్ అన్న సంగతి తెలిసిందే. తాను దావోస్ కు రావటం ద్వారా స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా నెరవేరినట్లుగా పేర్కొన్నారు. తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా దావోస్ కు వచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు.

నోటికి వచ్చినట్లుగా వ్యవస్థలపై వ్యాఖ్యలు చేసే వారితో.. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఫోటోలు దిగటం దేనికి నిదర్శనం? అన్నది అసలు ప్రశ్న. చాలామంది వస్తారు.. అభిమానంతో ఫోటోలు దిగుతారన్న మాటలకు.. పంచ్ ప్రభాకర్ తో మంత్రి మిథున్ రెడ్డి ఫోటో దిగటాన్ని ఒకేలా చూడకూడదన్న మాట పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.