ఉగ్ర దాడుల నుంచి జవాన్లకు రక్షణ: ఇళ్లకు వెళ్లేందుకు హెలికాప్లర్లు

Mon Mar 01 2021 08:00:01 GMT+0530 (IST)

Protection of Jawans from Terrorist Attacks

భారత దేశానికే కాదు.. దేశ సరిహద్దులను నిత్యం కంటికి రెప్పలా రక్షించే సైనికులకు కూడా ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న విషయం తెలిసిందే. పుల్వామా తరహా ఉగ్ర దాడులు కేవలం సైనికులను మట్టుబెట్టేందుకు చేసినవే. ఈ నేపథ్యంలో దేశాన్ని రక్షించే సైనిక సిబ్బందిని రక్షించుకునేందుకు రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న సైనిక వర్గాల విజ్ఞప్తికి పచ్చజెండా ఊపింది. దీని ప్రకారం.. సైన్యంలో పనిచేసే వారు సెలవులపై వారి ఇళ్లకు వెళ్లాల్సి వస్తే.. వారికి ప్రత్యేకంగా హెలికాప్టర్ సౌకర్యం కల్పించాలని రక్షణ శాఖ నిర్ణయించింది.



సరిహద్దు భద్రతా దళానికి చెందిన MI-17 హెలికాప్టర్లను కశ్మీర్‌లో వినియోగించనున్నారు. సెలవు తీసుకున్న జవాన్లను వారి ఇళ్లకు చేరవేసేందుకు ఈ హెలికాప్టర్‌ను వినియోగించనున్నారు. ప్రస్తుతం జమ్ము కశ్మీర్ బోర్డర్‌లో పనిచేస్తున్న సైనికులు సెలవులు పుచ్చుకుని వారి ఇళ్లకు వెళ్లాలంటే.. రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ఉగ్రవాద దాడులకు అవకాశం ఎక్కువగా ఉందని ముఖ్యంగా మాగ్నటిక్ ఐఈడీ లేదా ఇతర పేలుడు పదార్థాల దాడులకు కూడా సైనికులు గురవుతున్నారని రక్షణ శాఖకు నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో వారానికి మూడు సార్లు హెలికాప్టర్‌ను వినియోగించి సైనికులను వారి ఇళ్లకు చేరవేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది.

హెలికాప్టర్ సౌకర్యం అయితే..కల్పించారు కానీ.. అది కశ్మీర్‌లోని ఏ ప్రాంతాల నుంచి ప్రయాణిస్తుందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అదేసమయంలో కశ్మీర్ నుంచి బయలుదేరి సైనికులను ఎక్కడ విడిచి పెడుతుందనే విషయంలోనూ స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు జమ్ము లేదా శ్రీనగర్ ఎయిర్ పోర్టుల వరకు సైనికులను హెలీకాప్టర్లలో విడిచి పెడతారని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల కిందట కశ్మీర్ దక్షిణ ప్రాంతంలోని పుల్వామాలో సీఆర్ పీఎఫ్ జవాన్లపై జరిగిన దారుణ ఉగ్రవాద దాడుల అనంతరం.. ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అప్పటి దాడిలో దాదాపు 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.