Begin typing your search above and press return to search.

పాఠాలు చెప్ప‌డానికి స్టూడెంట్స్ లేర‌ని 23 ల‌క్ష‌ల జీతం వెన‌క్కి ఇచ్చిన ప్రొఫెస‌ర్!

By:  Tupaki Desk   |   7 July 2022 7:12 AM GMT
పాఠాలు చెప్ప‌డానికి స్టూడెంట్స్ లేర‌ని 23 ల‌క్ష‌ల జీతం వెన‌క్కి ఇచ్చిన ప్రొఫెస‌ర్!
X
బిహార్ లో ఒక ప్రొఫెస‌ర్ వినూత్న చ‌ర్య‌కు దిగారు. పాఠాలు చెప్ప‌డానికి స్టూడెంట్స్ లేర‌ని.. అలాంటప్పుడు త‌న‌కు జీతం ఎందుక‌ని 33 నెల‌ల జీతాన్ని వెన‌క్కి ఇచ్చేశాడు. త‌న 33 నెల‌ల జీతం 23.8 ల‌క్ష‌లను వెన‌క్కి ఇవ్వ‌బోగా బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ బీహార్ యూనివర్సిటీ అధికారులు నిరాక‌రించడంతో ఈ వార్త వైర‌ల్ గా మారింది.

బిహార్ లో ముజఫర్‌పూర్‌లోని నితీశ్వర్ కాలేజ్ హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లల్లన్ కుమార్ త‌న 33 నెల‌ల జీతాన్ని వెన‌క్కి ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించి వార్త‌ల్లో నిలిచారు. పాఠాలు చెప్పడానికి స్టూడెంట్స్ ఎవరూ లేర‌ని.. త‌న‌ను వేరే కాలేజీకి అయినా మార్చాల‌ని ల‌ల్ల‌న్ కుమార్ యూనివ‌ర్సిటీ అధికారుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. స్టూడెంట్లకు పాఠాలు వినే ఆసక్తి లేదని.. అందుకే తన రూ.23.8లక్షల జీతాన్ని వెన‌క్కి ఇచ్చేశాన‌ని ఆయ‌న చెబుతున్నారు.

తాను ఢిల్లీ యూనివ‌ర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేసి కాలేజీలో ప్రొఫెస‌ర్ గా చేరిన‌ప్పుడు పీజీ త‌ర‌గ‌తులు చెప్పేందుకు పోస్టింగ్ ఇవ్వ‌లేద‌ని ల‌ల్ల‌న్ కుమార్ ఆరోపిస్తున్నారు.

త‌న కంటే త‌క్కువ ర్యాంకులో ఉన్న‌వారికి మాత్రం పోస్టింగు ఇచ్చార‌ని విమ‌ర్శిస్తున్నారు. కాలేజీ మారాల‌నుకుంటే బ‌దిలీల జాబితాలో పేరు లేకుండా చేస్తారు. త‌న డిమాండ్ నెరవేరేంత వరకూ ఇక్క‌డే నిర‌న‌స తెలుపుతాన‌ని ల‌ల్ల‌న్ కుమార్ చెబుతున్నాడు.

దీనిపై బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ బీహార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ ఆర్కే ఠాకూర్ స్పందించారు. ల‌ల్ల‌న్ కుమార్ ఆరోప‌ణ‌ల‌పై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.

ప్రొఫెసర్ లల్లన్ కుమార్ త‌న 33 నెల‌ల జీతం 23.8 లక్ష‌ల జీతం వెన‌క్కి తీసేసుకోమ‌ని చెక్ ఇచ్చాడని దానిని తాము తీసుకోలేదని వైస్ చాన్స‌ల‌ర్ తెలిపారు. మ‌రోవైపు కాలేజీ ప్రిన్సిపాల్ మ‌నోజ్ కుమార్ వాద‌న మ‌రోలా ఉంది. రెండేళ్లుగా కరోనాతో క్లాసులే జ‌ర‌గ‌లేద‌ని.. ఇప్పుడిప్పుడే స్టూడెంట్సు వ‌స్తున్నార‌ని.. ఇంత‌లోనే ల‌ల్ల‌న్ కుమార్ తొంద‌ర‌ప‌డ్డార‌ని చెబుతున్నారు.