Begin typing your search above and press return to search.

యోగికి చెక్ పెట్టేలా ప్రియాంక అడుగులు

By:  Tupaki Desk   |   13 Sep 2021 9:39 AM GMT
యోగికి చెక్ పెట్టేలా ప్రియాంక అడుగులు
X
కేంద్రంలో అధికారంలోకి రావాల‌నే త‌పించే ఏ పార్టీకైనా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌పై ప‌ట్టు సాధించ‌డం కీల‌కం. అక్క‌డ 403 అసెంబ్లీ స్థానాలు 80 లోక్‌స‌భ స్థానాలున్నాయి. ఈ రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అక్క‌డ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి లోక‌స‌భ‌ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు అనుకూలంగా వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో కేంద్రంలో అధికారం ద‌క్కించుకునే దిశ‌గా ఛాన్స్ దొరుకుతుంది. అందుకే యూపీ ఎన్నిక‌ల‌పై అన్ని పార్టీలు ప్ర‌ధాన దృష్టి సారిస్తాయి. వ‌చ్చే ఏడాది అయిదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల్లో భాగంగా అక్క‌డ కూడా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ఇప్పుడ‌క్క‌డ అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వాన్ని కాపాడుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఎందుకంటే అక్క‌డ ఏ మాత్రం వ్య‌తిరేక ఫ‌లితాలు వ‌చ్చినా ఆ ప్ర‌భావం 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ప‌డుతుంది.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ కూడా యూపీపై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఒక‌ప్పుడు ఆ రాష్ట్రం ఒక వెలుగు వెలిగిన హ‌స్తం పార్టీ ఇప్పుడు మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వాన్ని సొంతం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. అందుకే వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యోగి స‌ర్కారును గ‌ద్దె దించేందుకు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్త‌లు మొద‌లెట్టింది. అందులో భాగంగా కాంగ్రెస్‌లో కీల‌క నాయ‌కురాలు ప్రియాంక గాంధీ వాద్రా బ‌రిలో దిగుతున్నారు. ప్ర‌స్తుతం తూర్పు ప్రాంత పార్టీ ఇంచార్జ్‌గా కొన‌సాగుతోన్న ప్రియాంక యోగికి స‌వాలు విసిరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆమె సార‌థ్యంలో భారీ బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు పార్టీ శ్రీకారం చుట్టింది.

ప్ర‌తిజ్ణా యాత్ర పేరుతో ఆమె సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా తిర‌గ‌బోతోంది. ఆ నెల 20న ఈ యాత్ర ఆరంభం కానుంది. ప్రియాంక ఆధ్వ‌ర్యంలో సాగే ఈ యాత్ర‌లో భాగంగా ప్ర‌తి మారుమూల గ్రామంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రించేలా కాంగ్రెస్ నాయ‌కులు అందులో భాగ‌మ‌యేలా దీన్ని రూపొందించారు. ఈ యాత్ర‌లో భాగంగా రాష్ట్రంలో 12 వేల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాలని ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నారు. ఓ రాష్ట్రంలో 12 వేల కిలోమీట‌ర్ల మేర యాత్ర అంటే అసాధార‌ణ విష‌యం. కానీ దీన్ని ఎలాగైనా విజ‌య‌వంతం చేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో కాంగ్రెస్ ఉంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఏ పెద్ద పార్టీతోనూ పొత్తు పెట్టుకోమ‌ని ఇప్ప‌టికే స‌మాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. మ‌రోవైపు కాంగ్రెస్‌తో పొత్తుకు బ‌హుజ‌న్ స‌మాజ్‌వాది పార్టీ మాయావ‌తి కూడా సుముఖంగా లేరు. దీంతో ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఒంట‌రిగానే పోటీ చేసే ప‌రిస్థితి ఎదుర‌యేలా ఉంది. అందుకే ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల‌పై పార్టీ దృష్టి సారించింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ప‌రిస్థితుల‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ యూపీ ఓటర్ల‌ను ఆక‌ర్షించేందుకు సిద్ధ‌మైంది. ప్ర‌తి గ్రామానికి కాంగ్రెస్ అనే నినాదంతో ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను రూపొందిస్తోంది. వ‌చ్చే యూపీ శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో మొత్తం 403 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టేందుకు పార్టీ అధిష్ఠానం ప్రాథ‌మికంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం.