Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో ఇక చక్రం తిప్పేది ప్రియాంకేనా?

By:  Tupaki Desk   |   11 Aug 2020 8:10 AM GMT
కాంగ్రెస్ లో ఇక చక్రం తిప్పేది ప్రియాంకేనా?
X
కాంగ్రెస్ అధినేత్రి సోనియా చాలించుకుంది.. యువ నేత రాహుల్ గాంధీ వదిలేశాడు.. ఇప్పుడు 100 ఏళ్ల కాంగ్రెస్ కు దిక్కెవరు అంటే.. ప్రియాంక గాంధీ దూసుకొచ్చింది. అవును ప్రియాంక వల్లే ఇప్పుడు కాంగ్రెస్ కు మంచి రోజులు రాబోతున్నాయని కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ను వీడిన సచిన్ పైలెట్ ను తిరిగి తీసుకొచ్చిన ప్రియాంక నాయకత్వంలోనే కాంగ్రెస్ మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

అమ్మ సోనియాకి ఉన్న ఇగో తగ్గించి.. వృద్ధ జంబూకాలను పక్కనపెట్టి అన్న రాహుల్ గాంధీని మీటింగ్ కు ఒప్పించి.. సచిన్ పైలెట్ ను రప్పించి మెప్పించి కాంగ్రెస్ లోనే ఉండేటట్టు చేసింది కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీనే అన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలకుండా ఉండేటట్టు కాపాడింది ప్రియాంకగాంధీనే అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

సచిన్ పైలట్ కు ప్రస్తుతం పాత పదవులు ఇచ్చేటట్టు అతడి మద్దతుదారులైన ఎమ్మెల్యేలకు కొన్ని మంత్రి పదవులు ఇచ్చేటట్టు ప్రియాంక గాంధీ ఒప్పించినట్టు తెలిసింది. అలాగే వచ్చే ఎన్నికల క్యాంపెయిన్ అంతా సచిన్ పైలెట్ కు అప్పజెప్పి గెలిస్తే సీఎంను చేస్తాము అని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రియాంక గాంధీ చొరవ తీసుకుందని.. ‘నీవు నా తమ్ముడితో సమానం అని ప్రియాంక.. సచిన్ ను ఒప్పించిందని’ ఢిల్లీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇలా వృద్ధ జంబూకాలను పక్కనపెట్టి ప్రియాంక గాంధీ సాహసమే చేశారు. ఆమెకు పార్టీలో ఇలా కీలక బాధ్యతలు అప్పగిస్తే పార్టీ బాగుపడుతుందని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ను వదిలిన నాయకులను తిరిగి కాంగ్రెస్ లోకి మళ్లి రప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ప్రియాంక ఇలానే ముందుకెళ్తే వీడిపోయిన వారంతా కాంగ్రెస్ లోకే వస్తారని ఆ పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.