Begin typing your search above and press return to search.

130 ఏళ్ల తర్వాత తొలిసారి రాజకుమారుడు కోర్టు బోనులో!

By:  Tupaki Desk   |   3 Jun 2023 10:00 AM GMT
130 ఏళ్ల తర్వాత తొలిసారి రాజకుమారుడు కోర్టు బోనులో!
X
గడిచిన 130 ఏళ్లలో ఎప్పుడూ చూడని ఒక ఉదంతం బ్రిటన్ రాజకుటుంబంలో చోటు చేసుకోనుంది. బ్రిటన్ రాజు చార్లెస్ 3 రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ కోర్టు ముందు హాజరు కాబోతున్నారు. ఒక కేసులో సాక్ష్యం చెప్పటానికి కోర్టుకు వస్తున్నారు. ఒక కేసులో భాగంగా లండన్ హైకోర్టులో సాక్ష్యుల బోనులో నిలబడనున్న అరుదైన ఉదంతం చోటు చేసుకోనుంది. గడిచిన 130 ఏళ్లలో బ్రిటన్ రాజకుటుంబీకుల్లో సాక్ష్యం చెప్పటానికి కోర్టుకు వస్తున్నది హ్యారీనే కావట గమనార్హం.

ఇంతకూ ఏ కేసు విషయంలో ఆయన కోర్టుకు రాబోతున్నారన్న విషయానికి వస్తే.. హ్యారీతో పాటు.. సినిమా.. క్రీడా రంగానికి చెందిన దాదాపు వంద మందికి పైగా ప్రముఖులు.. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్ పై వేసిన కేసులో సాక్ష్యం చెప్పటానికి ఆయన రానున్నారు. ఇంతకీ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. బ్రిటన్ లో మీడియా సంస్థలు ప్రముఖుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటమే కాదు.. సంబంధం లేకున్నా కాళ్లు.. వేళ్లు పెట్టేసి కెలికేస్తుంటారు.

వారి అతి ఎంతవరకు వెళుతుందంటే.. జర్నలిస్టులు కొందరు తమ పరిధి దాటి ముందుకు వెళ్లటమే కాదు.. కొందరు గూఢాచారుల్ని నియమించుకోవటం.. సెలబ్రిటీలు.. ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వివరాల్ని సేకరించేందుకు వారి ఫోన్లు హ్యాక్ చేయటం మొదలుకొని మోసపూరిత విధానాలకు ప్రదర్శిస్తుంటారు. 1991 నుంచి 2011 వరకు సదరు పత్రిక చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.

దీనికి సంబంధించి ఉదంతాలపై చర్యలకు మిర్రర్ పై ప్రముఖులు కేసులు వేశారు. వీటికి సంబంధించిన విచారణ మే 10 నుంచి మొదలైంది. ఈ కేసులో తన సాక్ష్యాన్ని కోర్టుకు చెప్పేందుకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు హాజరు కానున్నారు. ఇక.. చరిత్రలోకి వెళితే బ్రిటన్ రాజ కుటుంబంలోని వారు కోర్టుకు హాజరైన ఉదంతం చివరిసారిగా 1890లోనూ 1870లోనూ చోటు చేసుకుందని చెబుతున్నారు.

అయితే.. ఈ రెండు కేసులు కూడా ఎడ్వర్డ్ 7 కోర్టుకు హాజరయ్యారు. ఆయన రాజు కావటానికి ముందే కోర్టుకు హాజరయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కోర్టు ముందుకు వచ్చిన సందర్భం ఇదేనని చెబుతున్నారు. ఈ కేసు విషయంలో కోర్టు ఏం చెబుతుందో చూడాలి.