Begin typing your search above and press return to search.

అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు?

By:  Tupaki Desk   |   3 Jun 2023 10:00 AM GMT
అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు?
X
అవును.. ఆయన అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడు. ఏపీలోని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే కేఆర్ సూర్యనారాయణ ఇప్పుడు కనిపించటం లేదు. ఆయన కోసం రెండు పోలీసు టీంలు వెతుకుతున్నాయి. అరెస్టు భయంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఇంతకీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలేం జరిగింది? అన్న విషయాల్లోకి వెళితే..

కమర్షియల్ ట్యాక్స్ (వాణిజ్య పన్నుల) విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారన్న కంప్లైంట్ మే 30న విజయవాడలోని పటమట పోలీసులకు అందింది. దీనికి సంబంధించిన కేసులో ఐదుగురిని నిందితులుగా చేర్చారు. వారిలో ఒకరు కేఆర్ సూర్యనారాయణ. ఇప్పటికే నలుగురు అధికారుల్ని అరెస్టు చేసిన పోలీసులు.. ఐదో నిందితుడిగా చేర్చిన సూర్యనారాయణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నలుగురికి కోర్టు రిమాండ్ విధించింది.

ఈ కేసును ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. వారి నుంచి వస్తున్న ఆదేశాలకు తగ్గట్లే విజయవాడ పోలీసులు నడుచుకుంటున్నట్లుగా తెలిసింది. ఈ కేసు వివరాల్ని విజయవాడ నగర కమిషనర్ కాంతిరాణా టాటా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ కేసులో తొలుత సూర్యనారాయణను అరెస్టు చేయొద్దని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. ఆయన్ను అరెస్టు చేస్తే ఉద్యోగ సంఘాల్లో వ్యతిరేకత వస్తుందని భావించినట్లు చెబుతున్నారు. అయితే.. ఆ తర్వాత నిర్ణయం మారిందని.. మిగిలిన వారి మాదిరే సూర్యనారాయణను కూడా అరెస్టు చేయాలన్న ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది.

దీంతో.. ఆగమేఘాలపై స్పందించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు రెండు టీంలు ఏర్పాటు కావటం.. ఆ సమాచారాన్నిఅందుకున్నసూర్య నారాయణ తన రెండు ఫోన్లను వదిలేసి.. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఆయన ఫోన్లతో పాటు.. ఆయన అనుచరుల ఫోన్ల మీద పోలీసులు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏమైనా తాజా పరిణామం ఏపీ ఉద్యోగ సంఘంలో హాట్ టాపిక్ గా మారింది.