‘అ.. ఆ’ లు నేర్పించడమే.. ప్రవీణ్ కుమార్ రాజకీయ ఎజెండా..!

Thu Jul 29 2021 15:49:04 GMT+0530 (IST)

Praveen Kumar Political Agenda

అకస్మాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వడివడిగా అడుగులు వేస్తున్న ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ఎజెండాను.. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు అనుచరులు. త్వరలో ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీలో చేరడం ఖాయమైపోయిన సంగతి తెలిసిందే. అయితే.. అరంగేట్రం అట్టహాసంగా ఉండాలని భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.నల్గొండ జిల్లా నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని ప్రవీణ్ కుమార్ నిర్ణయించుకున్న నేపథ్యంలో.. అందుకు తగిన వేదికను సిద్ధం చేసే పనిలో పడ్డారు బీఎస్పీ స్వేరోస్ సభ్యులు. అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 8వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా లక్షన్నర మందిని తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ మేరకు బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు స్వేరోస్ సభ్యులు గడిచిన రెండు రోజులుగా నల్గొండ జిల్లాలోని పలు గ్రామాల్లో తిరుగుతూ జనాన్ని సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించినట్టు తెలుస్తోంది. వీరి ఆధ్వర్యంలో సభను విజయవంతం చేసేందుకు సీరియస్ గా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

గ్రామాల్లోకి వెళ్లి బహుజన వాదం గురించి వివరిస్తూ.. మన జీవితాల బాగు కోసమే ప్రవీణ్ కుమార్ వస్తున్నారని ఆయన్ను బలపరిచేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకొని తరలి రావాలని కోరుతున్నారు. బాధ్యులు లేనిచోట ఇతర కార్యకర్తలే తిరుగుతూ.. సమాజ సేవపట్ల అభిలాష ఉన్న యువకులను కలుస్తూ సభకు హాజరు కావాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.