Begin typing your search above and press return to search.

ఈ ప‌ది అంశాల‌మీదే జ‌గ‌న్ .. ప్ర‌శాంత్ కిశోర్‌ ను పిలిపించాడా?

By:  Tupaki Desk   |   12 Jan 2021 12:21 PM GMT
ఈ ప‌ది అంశాల‌మీదే జ‌గ‌న్ .. ప్ర‌శాంత్ కిశోర్‌ ను పిలిపించాడా?
X
ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌, గ‌త 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చేందుకు కృషి చేసిన ప్ర‌శాంత్ కిశోర్‌తో ముఖ్యమంత్రి జ‌గ‌న్‌.. ఇటీవ‌ల భేటీ అయిన విష‌యం తెలిసిందే. నిజానికి ఇటు జ‌గ‌న్‌, అటు ప్ర‌శాంత్ కిశోర్ కూడా క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నారు. పాల‌నాప‌రంగా జ‌గ‌న్ బిజీ అయితే.. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో మ‌మ‌తను మ‌ళ్లీ పీఠం ఎక్కించే బాధ్య‌త‌ల‌ను ప్ర‌శాంత్ కిశోర్ భుజాల‌పై వేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కూడా అత్యంత బిజీగా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇంత హుటాహుటిన ఈ ఇద్ద‌రు ఎందుకు భేటీ అయ్యారు? పైగా ఇరువురు కూడా సుమారు 2 గంట‌ల‌పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ చ‌ర్చ‌లు ఏయే అంశాల‌పై ఉండి ఉంటాయి? అనే అనుమానాలు అంద‌రినీ తొలిచేస్తున్నాయి.

ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్‌-ప్ర‌శాంత్ కిశోర్‌ల భేటీపై అనేక ఊహాగానాలు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. అయితే.. ఇత‌మిత్థంగా ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో అధికార వ‌ర్గాల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌ను బ‌ట్టి.. ఆయా వ‌ర్గాలు అందిస్తున్న స‌మాచారం బ‌ట్టి.. మొత్తం 10 అంశాల‌పై చ‌ర్చించేందుకే జ‌గ‌న్‌.. ప్ర‌శాంత్ కిశోర్‌ను తాడేప‌ల్లికి ర‌ప్పించార‌ని తెలుస్తోంది. ఆ ప‌ది అంశాలు ఏంటంటే.. బీజేపీ.. వైసీపీ మీద యుద్ధం చేస్తున్న యాక్టింగ్ చేయ‌డంపై చ‌ర్చించార‌ని స‌మాచారం. అదేవిధంగా చంద్ర‌బాబు అనూహ్యంగా హిందూత్వను తీసుకుని రావ‌డం, దేవాల‌యాల‌పై వ‌రుస‌గా జ‌రుగుతున్న దాడుల‌నుప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్ల‌డంలో బాబు స‌క్సెస్ అయ్యారు. ఇది ఆయ‌న‌కు ప్ల‌స్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ అంశంపై విస్తృతంగా చ‌ర్చించిన‌ట్టు తెలిసింది.

ఇక‌, రాష్ట్రంలో ఎన్ని ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టినా.. జ‌గ‌న్ స‌ర్కారుకు మైలేజీ రాక‌పోవ‌డం కూడా చ‌ర్చ‌ల్లో కీల‌కంగా ప్ర‌స్తావించిన అంశ‌మ‌ని అంటున్నారు. ఈ విష‌యంపై కొన్నాళ్లుగా ప్ర‌భుత్వం మ‌ధ‌న ప‌డుతోంది. ఎన్నో ప‌థ‌కాలు పెడుతున్నా.. ప్ర‌భుత్వంపై సానుభూతి క‌నిపించ‌డం లేదు. అదేవిధంగా.. తాను ఎన్నిసార్లు చెప్పినా.. వైసీపీ ఎమ్మెల్యేల ప‌నితీరు మార‌క‌పోవ‌డం వంటివి ప్ర‌ధానంగా చ‌ర్చించార‌ని తెలుస్తోంది. అక్ర‌మాలు చేయొద్ద‌ని, అవినీతికి పాల్ప‌డ‌వ‌ద్ద‌ని, క‌ల‌సి క‌ట్టుగా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని చెబుతున్నా.. ఎవ‌రికి వారుగా రాజ‌కీయాలు చేయ‌డం జ‌గ‌న్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ నేప‌థ్యంలో దీనిపైనా చ‌ర్చించార‌ని స‌మాచారం.

అదేవిధంగా.. రాష్ట్రంలో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ వ‌చ్చిన త‌ర్వాత‌.. వైసీపీ కార్య‌క‌ర్త‌లు బూత్ స్థాయిలో యాక్టివ్‌గా లేక‌పోవ‌డంపైనా జ‌గ‌న్‌.. ప్ర‌శాంత్ కిశోర్‌తో చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. అన్నీ వ‌లంటీర్లే చూసుకుంటు న్నారు.. అనే ఆలోచ‌న‌తో బూత్ లెవెల్ కార్య‌క‌ర్త‌లు నిర్ల‌క్ష్యం చేస్తుండ‌గా.. మ‌రికొన్ని చోట్ల‌.. బూత్ లెవ‌ల్ కార్య‌క‌ర్త‌ల‌కు ప్రాధాన్య‌మే లేకుండా పోయింది. దీని ఎఫెక్ట్ పార్టీపై ఎక్కువ‌గానే ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో ఈ విష‌యంపైనా చ‌ర్చించిన‌ట్టుతెలుస్తోంది. అదేవిధంగా జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ ప‌నితీరు బాగోలేక పోవ‌డంపైనా జ‌గ‌న్ చ‌ర్చించిన‌ట్టు తెలిసింది.

ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు, అక్క‌డి ప‌రిస్థితిని కూడా జ‌గ‌న్ చ‌ర్చించార‌ని స‌మాచారం. అక్క‌డి అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్ మ‌ళ్లీ గెలుస్తుందా? లేదా? ఒక వేళ గెల‌వ‌క‌పోతే.. బీజేపీ పుంజుకుంటే.. ప్రాంతీయ పార్టీల‌ను తొక్కేస్తుంద‌నే అంశంపైనా జ‌గ‌న్.. పీకేతో చ‌ర్చించార‌ని అధికార వ‌ర్గాల భోగ‌ట్టా. ఒక‌వేళ బెంగాల్‌లో బీజేపీ పుంజుకుంటే.. ఆ ప్ర‌భావం ఏపీపైనా ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని, ఇక‌, రాష్ట్రంలో బీజేపీ నేత‌ల దూకుడును త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌నే కోణంలో జ‌గ‌న్ చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

మ‌రోవైపు పొరుగు రాష్ట్రం కేసీఆర్‌ తో ఎలాంటి సంబంధాలు ఉంటే బెట‌ర్ అనే అంశంపైనా పీకేతో నిశితంగా జ‌గ‌న్ చ‌ర్చించార‌ని తెలిసింది. ఆదిలో కేసీఆర్‌తో సంబంధాలు బాగానే ఉన్నా.. మ‌ధ్య‌లో జ‌లాల విష‌యంలో బెడిసి కొట్టాయి. మ‌ళ్లీ త‌ర్వాత‌.. ఒకింత పుంజుకున్నా.. ముందున్నంత సాన్నిహిత్యం క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో కేసీఆర్‌తో ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే అంశంపై దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలోకి వ‌చ్చేసరికి బీజేపీతో ఎలా ముందుకు వెళ్లాలి? సై అంటే సై అనాలా? లేక స‌ర్దుకుపోతే బెట‌రా? అనే అంశంపైనా దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం.

అదేవిధంగా గ‌తంలో ప్ర‌భుత్వం ఏర్పాటు స‌మ‌యంలోనే రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రుల‌ను మారుస్తామంటూ.. జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆ మాట‌కు క‌ట్టుబ‌డి.. ప్ర‌స్తుతమున్న మంత్రి వ‌ర్గాన్ని మారిస్తే.. ఇటు పార్టీలోను, అటు రాజ‌కీయంగాను రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌నే అంశాల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. ప్ర‌శాంత్ కిశోర్‌ తో సుదీర్ఘంగా చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. మొత్తానికి వీరిద్ద‌రి చ‌ర్చ‌ల‌పై ఇటు వైసీపీలోను, అటు.. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఆస‌క్తి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.