పీకే జోస్యం: మళ్లీ ప్రధాని ఆయనేనట!

Tue Feb 12 2019 22:11:57 GMT+0530 (IST)

Prashant Kishor: Narendra Modi to return as PM

ఎన్నికల్లో గెలుపు వ్యూహాల్ని రచించటంలోనూ.. వాటిని అమలు చేయటంలోనూ మంచి పేరున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఆయన అంత పాపులర్ కానప్పటికీ.. మోడీ ఘన విజయంతో ఆయన పేరు మారుమోగింది. పలు రాజకీయ పార్టీలు ఆయన సలహాలు.. సూచనల కోసం ఎగబడిన పరిస్థితి.ఇదిలా ఉంటే..కొన్ని రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చేందుకు సిద్ధమైన ఆయన.. అనూహ్యంగా బిహార్ అధికారపక్షమైన జేడీయూలో చేరి మరో సంచలనం సృష్టించారు. అనంతరం ఆయన పార్టీకే పరిమితమయ్యారు. రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాల్ని సిద్ధం చేసే పని నుంచి బయటకు వచ్చినట్లుగా ఆయన చెబుతుంటారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయన్న అంచనాలు వ్యక్తమవుతున్న వేళ.. ప్రధానమంత్రి పదవి మళ్లీ మోడీనే చేపడతారంటూ సెలవిచ్చారు.

ఎన్నికల వ్యూహాల్ని రచించటం.. ప్రజల నాడిని పసిగట్టటంలో మంచి దిట్టగా పేరున్న ప్రశాంత్ కిశోర్ నోట.. మోడీనే మళ్లీ పీఎం అన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశ వ్యాప్తంగా మోడీ వ్యతిరేఖ గాలులు వీస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తుంటే.. అందుకు భిన్నంగా పీకే చెప్పిన మాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలా గెలుస్తారన్న విషయంపై క్లారిటీ ఇవ్వనప్పటికీ.. మోడీ మరోసారి ప్రధాని కావటం ఖాయమని చెప్పటం గమనార్హం. అంతేకాదు.. బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో ప్రధాని అభ్యర్థి మారతారన్న వార్తల్లో పస లేదని ఆయన కొట్టి పారేస్తున్నారు.

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని పదవికి ప్రత్యామ్నాయ నేతగా చెప్పటం సరికాదన్నారు. ఎన్డీయే కూటమిలో నితీశ్ పెద్ద నేత అయినప్పటికీ.. ఆయన ప్రధాని పదవికి పోటీదారుగా తాను భావించటం లేదన్న మాట పీకే నోట వచ్చింది. మరి.. పీకే మాటల్లో నిజం ఎంతన్నది తేలాలంటే మరో మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే.