ప్రధాని మోడీపై సెటైర్లు వేసిన ప్రకాష్ రాజ్

Sat Jul 02 2022 17:00:01 GMT+0530 (IST)

Prakash Raj Comments on Modi

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆది నుంచి బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఈ మేరకు ఆయన ట్వీట్లలో ఎండగడుతుంటారు. ముఖ్యంగా బీజేపీ హిందుత్వ రాజకీయాన్ని ఆయన విమర్శిస్తుంటారు. ఈక్రమంలోనే బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలోని బెంగళూరు నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఇటీవల 'మా' ఎన్నికల్లో ప్యానెల్ తో పోటీచేసి ఓటమి చవిచూశారు.ప్రతీసారి మోడీ నిర్ణయాలపై కౌంటర్లు వేసే నటుడు ప్రకాష్ రాజ్.. తాజాగా ప్రధాని నరేంద్రమోడీపై సెటైర్లు వేశారు.  ట్విట్టర్ వేదికగా 'తెలంగాణలో అద్భుత పాలన నడుస్తోందని చెబుతూనే మోడీ తెలంగాణ పాలనను చూసి నేర్చుకోవాలి' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ పేరు ప్రస్తావించకుండా హైదరాబాద్ వస్తున్న అత్యుత్తమ నాయకుడికి స్వాగతం అంటూ ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

డియర్ సుప్రీంలీడర్ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ పోస్ట్ చేస్తూ 'బీజేపీ పాలిత రాష్ట్రాలలో మోడీ పర్యటన సమయంలో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన మొత్తం నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేసుకుంటున్నారని.. కానీ ప్రజల అభివృద్ధి కోసమే తెలంగాణలో డబ్బులు ఖర్చు చేస్తారని' ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర పర్యటనను మోడీ ఆస్వాదించాలని.. దూరదృష్టితో మౌలిక సదుపాయాలు ఎలా అందించాలో చూసి నేర్చుకోవాంటూ సున్నితంగా చురకలంటించారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు యాదాద్రి ఆలయం టీహబ్ 2 ప్రభుత్వ ఆసుపత్రులు గురుకుల పాఠశాల భవనాలతోపాటు సీఎం కేసీఆర్ ఫొటోలను ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో షేర్ చేసి మోడీని టార్గెట్ చేశారు. 'జస్ట్ ఆస్కింగ్' అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు.

మోడీ విధానాలను ఆయన తీరును బహిరంగంగా విమర్శించిన వాళ్లలో దక్షిణాది విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒకరు.  ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై  ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో కౌంటర్ వేశారు. ఓ సమావేశంలో చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ.. 'ప్రధాని మోడీ రెండు గంటలే నిద్రపోతారని.. ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని' ప్రశంసించాడు. దీనిపై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ.. 'దయచేసి కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించండి. నిద్రలేకపోవడం అనేది ఓ జబ్బు. వైద్యపరిభాషలో దీన్ని ఇన్సోమ్మియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు.. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి' అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రకాష్ రాజ్ సన్నిహితుడు. ఇటీవల పీకేతో చర్చల్లో ప్రకాష్ రాజ్ ను సైతం కేసీఆర్ పిలిపించి మాట్లాడారు. అలాగే తెలంగాణలో అభివృద్ధి పనులను పీకేతో కలిసి ప్రకాష్ రాజ్ పరిశీలించారు. కేసీఆర్ తో సన్నిహితంగా మెలుగుతారు. బీజేపీ విధానాలను తీవ్రంగా తప్పుపడుతారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యక్రమాలను టార్గెట్ చేసి మోడీపై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు.