Begin typing your search above and press return to search.

ఏపీలో సంక్షోభం దిశ‌గా విద్యుత్ రంగం.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   14 Oct 2021 9:45 AM GMT
ఏపీలో సంక్షోభం దిశ‌గా విద్యుత్ రంగం.. రీజ‌నేంటి?
X
దేశం మాట ఎలా ఉన్నా.. ఏపీలో విద్యుత్ సంక్షోభం దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయా? త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లకు విద్యుత్ షాక్ త‌గ‌ల‌నుందా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కు లు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన‌ధికార విద్యుత్ కోత‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని చెబుతున్నారు. అయితే.. దీనికి కార‌ణాలేంటి? ఎందుకు జ‌రుగుతోంది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. వాస్త‌వానికి ఉమ్మ‌డి ఏపీలో విద్యుత్ కోత‌లు ఉండేవి. కానీ, న‌వ్యాంధ్ర ఏర్పాటు త‌ర్వాత‌.. సౌర విద్యుత్‌, ప‌వ‌న్ విద్యుత్‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చిన నేప‌థ్యంలో వాటి ఉత్ప‌త్తి పెరిగింది. అయితే..ఇవి వాతావ‌ర‌ణ ఆధారితం కావ‌డంతో.. ఇప్పుడు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.

దీంతో రాష్ట్రంలో విద్యుత్ కోత‌ల దిశ‌గా ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై ఏపీ ట్రాన్స్ కో అధికారులు ఏమ‌న్నారంటే.. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి బొగ్గు కొర‌తే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ.. తాము డిమాండ్‌ను త‌ట్టుకునేలా ప‌నిచేస్తున్నామ‌ని.. ప్ర‌క‌టించారు. వాస్త‌వానికి ఏపీ జెన్‌కో వ్యవస్థాపిత సామర్థ్యం 5,010 మెగావాట్లు అయినప్పటికీ బొగ్గు కొరత కారణంగా 2,500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుందని, అయితే ప్రస్తుతం కొరత కారణంగా సెప్టెంబరులో 24 వేల టన్నులు మాత్రమే సరఫరా అయ్యిందని జెన్కో వెల్లడించింది. దేశంలో నెలకొన్న బొగ్గు కొరత కారణంగా ఏపీలో విద్యుత్‌ సంక్షోభం తలెత్తిందని ట్రాన్స్‌కో పేర్కొంది. నిరంతరాయ సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న సమయంలో ఒక్కో యూనిట్ కు 15 నుంచి 20 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చిందని తెలిపింది. బొగ్గు కొరత కారణంగా తక్కువ స్థాయిలో విద్యుత్ అంతరాయాలతో సరఫరా చేయగలుగుతున్నామని స్పష్టం చేసింది.

ఏపీలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 18,533 మెగావాట్లు అయినప్పటికీ సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావటం లేదని పేర్కొంది. ఇందులో 8,075 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఉన్నా బేస్ లోడుకు సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావటం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 908 గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి వస్తున్న విద్యుత్ కేవలం 100 మెగావాట్లు మాత్రమేనని ప్రకటించింది. ప్రస్తుతం ఏపీలో 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. పీక్ డిమాండ్ మేరకు 9,064 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోందని వెల్లడించింది. బొగ్గు కొరత కారణంగా వీటీపీఎస్ తో పాటు రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ లోని యూనిట్లను నిలిపివేయాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది.

అయితే.. ప్ర‌భుత్వ వాద‌న ఇలా ఉంటే.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వాద‌న మ‌రోలా ఉంది. బొగ్గుకు కొర‌త లేద‌ని. రాష్ట్ర ప్ర‌భుత్వం ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని.. తాము ఎప్ప‌టిక‌ప్పుడు హెచ్చ‌రిస్తూనే ఉన్నామ‌ని.. అయినా.. రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోల‌ద‌ని.. తాజాగా రాసిన లేఖ‌లో స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. బొగ్గు సేక‌ర‌ణ‌ల‌కుసంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌కాయిలు చెల్లించాల్సి ఉంద‌ని.. కూడా తెలిపింది. సో.. దీనిని బ‌ట్టి.. రాష్ట్ర ప్ర‌భుత్వంవైపే అన్ని వేళ్లూ క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న‌ రాష్ట్రం బొగ్గు బ‌కాయిలు కట్ట‌నందునే ఇలా జ‌రిగిందా? అనే సందేహాలు కూడా వ‌స్తున్నాయి.