Begin typing your search above and press return to search.

అశ్లీల సైట్లే కొంప ముంచుతున్నాయా?

By:  Tupaki Desk   |   2 Aug 2021 4:02 AM GMT
అశ్లీల సైట్లే కొంప ముంచుతున్నాయా?
X
సమాజంలో అశ్లీల సైట్లు అనర్థాలకు దారితీస్తున్నాయా? అంటే ఔననే అంటున్నాయి కొన్ని సర్వే నివేదికలు.. ఈ షాకింగ్ నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. సమాజంలో చెడుధోరణులు పెరగడానికి ఈ అశ్లీల సైట్లు చూడడం కారణంగా చెబుతున్నారు. తాజాగా బయటపడ్డ సర్వే నివేదికలో స్మార్ట్ ఫోన్లు కలిగిన వారిలో దాదాపు 89శాతం అశ్లీల సైట్లు రెగ్యులర్ గా చూస్తున్నట్లు సర్వేలో తేలింది.

దేశంలోని ఒక్కో స్మార్ట్ ఫోన్ సగటున నెలకు 9.5 గీగా బైట్స్ ఉపయోగిస్తుంటే అందులో మూడొంతుల డేటా కేవలం అశ్లీల వీడియోలు చూడడానికి వినియోగిస్తున్నారని ఓ అశ్లీల వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇందులో 18-24 సంవత్సరాల మధ్య ఉన్న 44శాతం మంది అశ్లీలాన్ని చూస్తున్నారని తేలింది. 25-34 వయసుల మధ్య ఉన్నారు 41శాతం మంది చూస్తున్నారు. ఇక 35-44 వయసున్న వారు 6శాతం, 45-54 వయసు మధ్యనున్న వారు కేవలం 4శాతం మంది మాత్రమే ఈ అశ్లీల వీడియోలు చూస్తున్నట్టు తేలింది. ఈ సర్వేను ప్రముఖ అశ్లీల వెబ్ సైట్ చేయడం గమనార్హం.

దీన్ని బట్టి ఎక్కువగా యువతనే ఈ అశ్లీల వెబ్ సైట్లు చూస్తున్నట్టు తేలింది. వారిలో మానసిక పరిస్థితులపై తీవ్రమైన మార్పులు వస్తున్నట్లు మానసిక శాస్త్రవేత్తలు తెలిపారు. అంతర్జాతీయంగా ఇంటర్నెట్ ప్రొవైడర్ల మధ్య పోటీ పెరగడంతో శాటిలైట్ టెక్నాలజీ పెరిగిపోవడం.. వ్యాపారంలో తీవ్రమైన పోటీ కారణంగా ఇంటర్నెట్ జనాలకు చాలా చవకగా దొరికి అశ్లీల వీడియోలు చూడడం ఎక్కువైపోయిందని అంటున్నారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చేయడంతో యువత, మధ్య వయసుల వారు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారని తేలింది.

నీలిచిత్రాలను విపరీతంగా చూస్తున్న యువ త కోరికలు అదుపులో ఉంచుకోలేక ఆడవాళ్లు, చిన్నపిల్లలను తమ లైంగిక కోరికలు తీర్చే వస్తువుగా చూస్తూ అఘాయిత్యాలు చేస్తున్నట్టు తేలింది. వీరిలో వస్తున్న మానసిక ప్రవర్తనతో ఇంట్లో పెద్దవాళ్లతో తరచూ గొడవలు, ఒంటరి మహిళలపై అత్యాచారాలకు దిగుతున్నారని తేలింది.

దేశంలో ఒకప్పుడు నీలి చిత్రాలను చూడాలంటే క్యాసిట్లు తెచ్చుకునేవారు. అవి అంతటా దొరికేవి కావు.. వీడియో పార్లర్లలో రహస్యంగా అమ్మేవారు. అది కూడా దగ్గరి వారికే ఇచ్చేవారు. నమ్మకమైన కస్టమర్లకే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, చవక ఇంటర్నెట్ పుణ్యమాని ఇంటర్నెట్ లోని వందల వెబ్ సైట్లలో అశ్లీల వీడియోలను ఉచితంగా చూస్తున్న పరిస్థితి నెలకొంది.

ఇక మన దేశంలో అశ్లీల వీడియోలను చూడడంపై ఎంత నిషేధం విధించినా.. రోజుకో కొత్త వెబ్ సైట్ ను రూపొందించి ప్రేక్షకులను షేర్ చేస్తున్నారు. దీంతో వాటిని చూస్తూ యువత పెడదారి పడుతోంది. దేశంలో అశ్లీల వీడియోలు చూడడం తప్పు కాదు.. కానీ వాటిని షేర్ చేయడం.. సినిమాలు తీయడం నేరం.. విదేశాల్లో విచ్చలవిడిగా తీసే సినిమాలను ఈజీగా ఇంటర్నెట్ సహాయంతో చూసేస్తున్నారు. ఇదే మన సమాజం కొంప ముంచుతోంది. ఈ క్రమంలోనే దేశంలో నేరాలు పెరిగి అనర్థాలకు దారితీస్తోంది. వీటికి అడ్డుకట్ట వేయాలని కేంద్రం ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ప్రభుత్వానికి ఈ అశ్లీల వీడియోల వ్యవహారం పెద్ద గుదిబండగా మారింది.