కట్టు తప్పుతోందా.. పట్టు జారుతోందా... ?

Mon Dec 06 2021 05:00:02 GMT+0530 (India Standard Time)

Politics In Andhrapradesh

రాజకీయాల్లో క్రమశిక్షణ అవసరం అంటారు. బయట ఎలా ఉన్నా పార్టీ కట్టుబాట్లను దాటితే మాత్రం వేటు పడక తప్పదు. ఇది శతాధిక చరిత్ర ఉన్న కాంగ్రెస్ నుంచి కొత్తగా పుట్టిన పార్టీ దాకా అంతా రాజకీయ నీతి ఒక్కటే. అయితే ఒక్కో పార్టీకి ఒక్కో తీరు. కాంగ్రెస్  లో కాస్తా ప్రజాస్వామ్యం ఎక్కువ. లోకల్ లీడర్స్ ఒకరిని ఒకరు ఎంత తిట్టుకున్నా అధినాయకత్వానికి అసలు ఖాతరు ఉండదు అదే తమ మీద ఒక్క మాట అంటే మాత్రం వెంటనే బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించి పార్టీ  ఆఫీస్  గేటు దారి చూపిస్తుంది. బీజేపీ సహా ఇతర జాతీయ పార్టీలలో కూడా కాస్తా అటు ఇటుగా ఇదే రూల్ అప్లై అవుతుంది.ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే మాత్రం మరింత గట్టిగా బిగిస్తారు. ఎందుకంటే ఒకే నాయకుడి చుట్టూ అల్లుకున్న పార్టీలు కుటుంబ పార్టీలే ఇక్కడ కనిపిస్తాయి. ఏ మాత్రం తేడా వచ్చినా పుట్టె మునుగుతుంది అన్న కంగారు ఉంటుంది. అదే విధంగా ఎవరైనా ఏ మాత్రం తల ఎగరేస్తారు అన్నది తెలిస్తే ముందే ఇంటి దారి చూపిస్తారు. ఒక విధంగా చెప్పాలీ అంటే పూర్తి అభద్రతాభావంతో ప్రాంతీయ నేతలు ఉంటారు అంటారు.

ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే టీడీపీ వైసీపీ రెండు ప్రాంతీయ పార్టీలు అయితే టీడీపీ కంటే కూదా వైసీపీలో కొంత స్వేచ్చ తక్కువే అన్న ప్రచారమూ ఉంది. చంద్రబాబు కూడా నిర్ణయాలు తానే తీసుకున్నా ఏదో ఒక పార్టీ వేదిక మీద కొందరు నేతలతో చర్చించి ప్రజాస్వామిక రూపం ఇవ్వడానికి చూస్తారు అని అంటారు. జగన్ అయితే తన మనసులో మాట ఎవరికీ చెప్పరు అదే విధంగా ఆయనకు చెప్పేందుకు కూడా ఎవరూ సాహసించరు అని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి.

ఇవన్నీ పక్కన పెడితే వైసీపీలో జగన్ మాటే శిరోధార్యం. ఆయన ఏం చెబితే అదే ఫైనల్. అలాంటి పార్టీలో ఇపుడు కొత్తగా నేతలు  కట్టుబాట్లు తప్పుతున్నారా అన్న చర్చ అయితే ఉంది. లేటెస్ట్ గా జగన్ సొంత జిల్లాకు చెందిన పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఏకంగా భువనేశ్వరి కాళ్ళు కన్నీటితో కడుగుతామని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.

తప్పు జరిగిందని మన్నించమని కూడా కోరుతామని చెప్పేశారు. ఒక విధంగా ఇది మొత్తం వైసీపీని ఇరకాటంలో పెట్టేసేలా ఉంది అంటున్నారు. శాసనసభలో  అసలు ఏమీ జరగలేదని తాను ఎవరినీ ఏమీ అనలేదని ఈ రోజుకీ వైసీపీ పెద్దలు వాదిస్తున్నారు. చంద్రబాబు ఏడుపుని డ్రామా అని కూడా అంటున్నారు.  అలాంటిది శివప్రసాదరెడ్డి తమ  కన్నీటితో భువనేశ్వరి కాళ్లు కడుగుతామని చెప్పడం ద్వారా తప్పుని ఒప్పేసుకోవడమే కాకుండా వైసీపీని పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేశారు అంటున్నారు.

ఈయనొక్కరే కాదు చాలా మంది నాయకులు ఈ మధ్య ఇలాగే మాట్లాడుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే ఏకంగా అమరావతి రైతుల వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించి వచ్చారు. ఆయన జై అమరావతి అన్న మాట అనలేదు కానీ అన్నీ కూడా అచ్చం టీడీపీ ఎమ్మెల్యే తీరునే అన్నీ చేసేసి  వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేశారు.

దీనికంటే ముందు అదే నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితే జగనన్న ఇళ్ల పధకాన్నే వెక్కిరించేశారు. ఎవరికీ సరిపోని ఇరుకు ఇళ్ళు అంటూ ఆయన విమర్శలు కూడా చేశారు. వీరి సంగతి ఇలా ఉంటే మాజీ మంత్రులు ఆనం రామ నారాయణరెడ్డి ధర్మాన ప్రసాదరావు వంటి వారి స్టైలే వేరు. వారు ఎపుడు సర్కార్ మీద బాణాలు వేస్తారో వారికే తెలియదు. అధికారులనే  అంటున్నామని చెబుతూ ప్రభుత్వాన్నే ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు అని అదే పార్టీలో గుసగుసలు పోతున్న వారూ ఉన్నారు.

మొత్తం మీద చూస్తూంటే పైకి వ్యక్తిగతం అంటూనే పార్టీని ప్రభుత్వాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసేలా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు అన్న చర్చ అయితే సాగుతోంది. మరి జగన్ మాటే ఫైనల్ ఆయన విధానమే రైట్ అన్న పార్టీలో ఇన్ని అభిప్రాయాలు ఉండడం అవి కూడా విపక్షానికి అస్త్రాలు గా మారుతూండడం నిజంగా విడ్డూరమే. మరి హై కమాండ్ వీరిని కట్టడి చేయడంలేదా లేక కాంగ్రెస్ కల్చర్ వైసీపీలో వేళ్ళూనుకుంటోందా అన్నదే పార్టీలో సాగుతున్న హాట్ హాట్ డిస్కషన్.