Begin typing your search above and press return to search.

ఒకే ఒక్క రాజ్యసభ సీటు...టోటల్ పాలిటిక్స్ చేంజ్... ?

By:  Tupaki Desk   |   17 Jan 2022 8:36 AM GMT
ఒకే ఒక్క రాజ్యసభ సీటు...టోటల్ పాలిటిక్స్ చేంజ్... ?
X
ఏపీలో ఇపుడు రాజ్యసభ సీటు గురించే హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఎవరు వదిలేసినా నేను వదలను అంటున్నారు సీపీఐ వృద్ధ నేత నారాయణ. జగన్ కి చిరంజీవికి జరిగిన వన్ టూ వన్ చర్చల సారాంశం అంతా అందరికీ తెలియాలి అని డిమాండ్ చేస్తున్నారు. సరే చెప్పాల్సిన వారు చెప్పేసారు. ఈ విషయంలో ఎన్ని డిమాండ్లు వచ్చినా కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు. అయినా ఈ రాజ్యసభ సీటు హీటు పెంచుతూనే ఉంది. మరో వైపు వైసీపీ కూడా రాజ్యసభ సీటు ఎవరికీ పిలిచి ఇచ్చేది లేదు అంటోంది. ఇలా ఈ వివాదం సాగుతూనే ఉంది మరి.

అదే టైమ్ లో ఒక్క రాజ్యసభ సీటు కోసం ఇంత రచ్చా. చర్చా అవసరమా అంటే తెలుగు రాజకీయాలను కూడా ఒకే ఒక్క రాజ్యసభ సీటు టోటల్ గా చేంజి చేసిన అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉందని పూర్వీకులు చెబుతారు. ప్రచారంలో ఉన్న కధనాల ప్రకారమే ఇదంతా చెప్పుకోవాలి. ఇంతకీ ఆ ప్రచారం ఏంటి, ఆ కధనం ఏంటి అంటే ఎర్లీ ఎయిటీస్ లోకి వెళ్లాల్సిందే.

అపుడు తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాస్ లో ఉండేది. అక్కడే కోలీవుడ్, టాలీవుడ్ మూవీస్ స్టూడియోస్ లో చకచకా సాగేవి. ఆ టైమ్ లోనే కోలీవుడ్ సూపర్ స్టార్ ఎమ్జీయార్ తమిళనాడు సీఎం అయ్యారు. ఇక మరో సీనియర్ మోస్ట్ నటుడు శివాజీ గణేషన్ అపుడు కాంగ్రెస్ లో ఉండేవారు. ఆయన సినిమాల్లో నటిస్తూనే కాంగ్రెస్ కి ప్రచారం చేసేవారు. ఒక సందర్భంలో ఆయనను రాజ్యసభకు నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరా గాంధీ నామినేట్ చేసారు. దాంతో అది కోలీవుడ్ సహా టాలీవుడ్ అంతా పెద్ద సెలబ్రేషన్ గా అయింది.

దాంతో అప్పట్లో టాలీవుడ్ కి అగ్రనటుడిగా ఉన్న ఎన్టీయార్ కి కూడా పాలిటిక్స్ మీద తొలిసారి మోజు కలిగింది అని అంటారు. ఆయన కూడా తనకు రాజ్యసభ సీటు ఇస్తే బాగుండుని అన్న భావనతో ఉండేవారట. అది అలా ఆయన సన్నిహితుల నుంచి కాంగ్రెస్ పెద్దల దాకా వెళ్ళిందట. అయితే ఎన్టీయార్ కి రాజ్యసభ ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలకు మనసొప్పలేదు అని అంటారు. ఇక ఎన్టీయార్ ఎపుడూ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉండేవారు కాదని అంటారు.

ఇందిరాగాంధీ కుటుంబ నియంత్రణ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న టై, లో గంపెడు పిల్లలు ముందు, కుటుంబ నియంత్రణ తప్పుడు విధానం అన్న సందేశం ఇచ్చేలా తాతమ్మ కల సినిమాను సొంత బ్యానర్ మీద, స్వీయ దర్శకత్వంలో తీశారు రామారావు. అలాగే ఉమ్మడి ఏపీ ముక్కలు కాకూడదని తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అన్న సాంగ్ ని కూడా మరో సినిమాలో పెట్టి నాటి కాంగ్రెస్ పాలకులకు దిశానిర్దేశం చేశారు.

ఇక ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా యమగోల సినిమాలో పాట కూడా ఉంది. యమ అర్జెన్సీ ఇక పై రద్దు అంటూ ఎన్టీయార్ మీద పాట ఉంటుంది. అలాగే ఒక యువజన నాయకుడు అంటూ అదే సినిమాలో ఇండైరెక్ట్ గా సంజయ్ గాంధీ మీద విమర్శ కూడా ఉంటుంది. ఇలా ఎన్టీయార్ తన సినిమాల్లో ఎప్పటికపుడు నాటి పాలకున విధానాల మీద సునిశిత విమర్శలు చేస్తూ వచ్చారు. దాంతో కాంగ్రెస్ కి రామారావు అంటే పెద్దగా పట్టింపు లేదు అంటారు.

అందుకే ఆయన రాజ్యసభ మీద మోజు పడ్డా కూడా చులకన చేసి మాట్లాడారని చెబుతారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన ఎన్టీయార్ ఆ తరువాత కొద్ది సంవత్స‌రాలకే తెలుగుదేశం పార్టీ పెట్టి ఏకంగా కాంగ్రెస్ కూశాలు కుదిపేశారు. ఎన్టీయార్ ప్రభంజనం ఏంటో చూపించారు. ఇదంతా ఎక్కడ వచ్చింది అంటే ఒకే ఒక్క రాజ్యసభ సీటు వల్ల అనుకోవాలి. అందువల్ల ఒకే ఒక రాజ్యసభ సీటు అని అసలు పక్కన పెట్టాల్సింది లేదు. దాన్ని అలాగే రాద్ధాంతం చేస్తూ పోతే మళ్ళీ తెలుగు రాజకీయాల్లో ఏమైనా కీలక పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అని కూడా అంటారు. సో ఆ సీటు ఎపుడూ హీటు గురూ అనే గుర్తుంచుకోవాలి.