Begin typing your search above and press return to search.

మా ఎంపీపై రాజకీయ కుట్ర జరుగుతోంది: సజ్జల సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   27 Jan 2023 11:29 AM GMT
మా ఎంపీపై రాజకీయ కుట్ర జరుగుతోంది: సజ్జల సంచలన వ్యాఖ్యలు
X
వైఎస్‌ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఆ పార్టీలో నెంబర్‌ టూగా చలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఎం జగన్‌ కు బంధువు అయిన వైఎస్‌ అవినాష్‌ రెడ్డిపై రాజకీయ కుట్ర జరుగుతోందని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోని టీడీపీ స్లీపర్‌ సెల్స్‌ (పరోక్షంగా సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ వంటి వారిని ఉద్దేశించి) వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారని సజ్జల ఆరోపించారు.

కాగా, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై సజ్జల మండిపడ్డారు. పవన్‌ ఏ ప్రాతిపదికన ఆ వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక అంశంపై మాట్లాడే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ ప్లాన్‌ కంటే ఎక్కువ నిధులు మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు రూ.33 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. సీఎం జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మూడేళ్లలోనే ఎస్సీ, ఎస్టీలకు రూ.48 వేల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.

చంద్రబాబు స్క్రిప్ట్‌ను చదివే "విజిటింగ్‌ గెస్ట్‌" పవన్‌ కల్యాణ్‌ అని సజ్జల తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు చేతిలో పవన్‌ రిమోట్‌ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై పవన్‌ కళ్యాణ్‌ మూడు ఆప్షన్స్‌ వింటుంటే నవ్వు వస్తోందని చెప్పారు. లాభం లేకున్నా చంద్రబాబుకు మద్దతివ్వడం వల్ల కలిగే నాలుగో ఆప్షన్‌ ఏమిటో కూడా చెప్పాలని పవన్‌ ను కోరారు.

తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి వైఎస్‌ జగనేనని తేల్చిచెప్పారు. మరి టీడీపీ, జనసేన కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్, లోకేష్, చంద్రబాబుల్లో ఎవరో చెప్పాలని కోరారు.

ప్రతిపక్షాలకు వైఎస్సార్‌సీపీ భయపడదని సజ్జల తేల్చిచెప్పారు. టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా ఎన్నికలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాల పొత్తులకు సంబంధించి వైఎస్సార్‌సీపీ గెలుపు అవకాశాలపై ఎలాంటి ప్రభావం లేదన్నారు.

కాగా సజ్జల వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని వైఎస్‌ వివేకా హత్య కేసులో విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 28న హైదరాబాద్‌ లో విచారణకు అవినాష్‌ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్బంగా ఆయనను అరెస్టు చేసే అవకాశముందనే ప్రచారం కూడా సాగుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో సజ్జల వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. అవినాష్‌ రెడ్డిపై రాజకీయ కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.