Begin typing your search above and press return to search.

జై తెలంగాణ పోలీస్.. నేతల స్పందన ఇదీ

By:  Tupaki Desk   |   6 Dec 2019 8:49 AM GMT
జై తెలంగాణ పోలీస్.. నేతల స్పందన ఇదీ
X
దిశను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సినీ, మేధావి, సాధారణ ప్రజలు న్యాయం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. మహిళలు, విద్యార్థినులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు.

అయితే దేశంలోని దిగ్గజ రాజకీయ నేతల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ప్రముఖ నాయకురాలు ఉమాభారతి దిశ ఎన్ కౌంటర్ పై ట్విట్టర్ లో స్పందించారు. తెలంగాణ పోలీసులను చర్యను ఆమె వేయినోళ్ల పొగిడేశారు. ‘ఈ ఘటన ఈ శతాబ్ధంలోనే మహిళల భద్రతకు భరోసానిచ్చిన అతిపెద్ద ఘటన. ఇది చేసిన పోలీసు అధికారులందరికీ గౌరవం దక్కాలి. ఇది దేశంలోని ఇతర రాష్ట్రాల మహిళల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తుంది. జై తెలంగాణ పోలీసులు’ అని ఉమాభారతి ట్వీట్ చేశారు.

మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ కూడా దిశ ఎన్ కౌంటర్ పై స్పందించారు. ‘ఈ ఎన్ కౌంటర్ ద్వారా దేశం మొత్తం ఉపశమనం పొందింది. వారు చేసిన పనికి నిందితులు శిక్షించబడ్డారు.దిశకు న్యాయం జరిగింది. ఆమె ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది’ అని తెలిపింది. దీనిపై ఉరిశిక్ష విధించాలని మేము కోరుతున్నా దిగువ కోర్టులు, హైకోర్టులు, సుప్రీం కోర్టులలో అప్పీల్ తో న్యాయం అనేది సుధీర్ఘకాలానికి పొడిగించబడుతుంది. సరైన న్యాయానికి చాలా సంవత్సరాలు పడుతోంది. ఉరి తీసిన పాపాన పోవడం లేదు. ఇలాంటి ఘటనలతోనే సత్వర న్యాయం జరుగుతుంది.

శిరోమణి ఆకాలీదళ్ నాయకుడు మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ దేశంలోని ప్రతీ ఆడబిడ్డ తండ్రి ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు చేసిన పనికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇలాంటి నేరాలకు ఇలాంటి శిక్ష బెటర్.

సామాన్యులకు నేర విచారణపై నమ్మకం సన్నగిల్లినందుకునే ఎన్ కౌంటర్ ను స్వాగతిస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉన్నావ్, హైదరాబాద్ లో మహిళలపై దాడులతో ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని.. ఎన్ కౌంటర్ ను వారు హర్షిస్తున్నారని తెలిపారు.

ఇక చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బాఘేల్ కూడా ఈ వివాదంపై స్పందించారు. నేరస్థుడు పారిపోతుంటే పోలీసులకు ప్రత్యామ్మాయం లేదని.. హైదరాబాద్ పోలీసులు చేసింది సరైందేనని తెలిపారు.

ఇక ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవి కూడా ఈ ఎన్ కౌంటర్ పై స్పందించారు. ఎన్ కౌంటర్ తో న్యాయం జరిగినట్టేనని తెలిపారు.

ఇక దిశ నిందితుల ఎన్ కౌంటర్ సాహసోపేతమైందని.. ఎన్ కౌంటర్ పై తలెత్తే న్యాయపరమైన ప్రశ్నలు వేరని.. అయితే దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబు అన్నారు.

ఇక లైంగిక దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ ను బీజేపీ ఎంపీ మేనకాగాంధీ తప్పుపట్టారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కోర్టులు, చట్టాలు ఎందుకని ఆమె ప్రశ్నించారు.