వైసీపీ నేత చెవిరెడ్డి అరెస్టు !

Thu Dec 03 2015 15:05:30 GMT+0530 (IST)

Police arrest Chandragiri MLA Chevireddy Bhaskar Reddy

అధికారపక్షంగా ఉన్నప్పుడు ఉండే వెసులబాటు విపక్షంలో ఉన్నప్పుడు సాధ్యం కాదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం తేడా జరిగినా చర్యకు ప్రతిచర్య వాయువేగంతో జరిగిపోతుంది. చట్టం తన పని తాను చేసుకుపోయే విషయంలో అధికార.. విపక్షాల మధ్య అంతరం బహిరంగ రహస్యమే.  ఈ నగ్న సత్యం తెలిసి కూడా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే  నేతలకు షాకుల మీద షాకులు తగులుతుంటాయి. తాజాగా అలాంటి షాకే వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తగిలింది.మామూలుగానే చెవిరెడ్డికి కాస్త దూకుడు ఎక్కువ. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఇక ఆగుతారా? తన  ప్రతాపం ప్రదర్శించటానికి తాను అధికారపక్ష ఎమ్మెల్యేని కానన్న విషయాన్ని ఆయన తరచూ మర్చిపోతుంటారు. ఇదే ఆయకు అసెంబ్లీలోనూ తిప్పలు తెచ్చింది.  ఈ మధ్యన రేణిగుంట విమానాశ్రయంలో ఎయిరిండియా మేనేజర్ రాజశేఖర్ మీద చేయి చేసుకోవటంతో పాటు.. నానా యాగీ చేసేశారు. తమ పార్టీ ఎంపీ మిధున్ రెడ్డితో పాటు ఆయన హడావుడి చేశారు.

దీనికి సంబంధించి ఎంపీ మిధున్ రెడ్డికి.. చెవిరెడ్డికి కొత్త తిప్పలు మొదలయ్యాయి. ఈ కేసులో చెవిరెడ్డి మీద చర్యల కోసం పోలీసులు వెతికే పరిస్థితి. దీంతో.. మరిన్ని సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా తాజాగా ఆయన పోలీసులకు లొంగిపోయారు. బెయిల్ కోసం ప్రయత్నించినా.. కోర్టులో చుక్కెదురు కావటంతో చెవిరెడ్డి పోలీసుల ముందు లొంగిపోయారు. విపక్షంలో ఉన్నప్పుడు అనవసరమైన ఆవేశాలకు లోనైతే.. ఇలాంటి తిప్పలు తప్పవన్న మాట వినిపిస్తోంది.