Begin typing your search above and press return to search.

పరారీలో ఉన్న స్వప్న సురేశ్ ను అరెస్టు చేసిన పోలీసులు

By:  Tupaki Desk   |   12 July 2020 9:50 AM GMT
పరారీలో ఉన్న స్వప్న సురేశ్ ను అరెస్టు చేసిన పోలీసులు
X
కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారిన బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. గడిచిన కొద్ది రోజులుగా పినరయ్ విజయన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో రాష్ట్ర సర్కారు కాస్త ఊపిరిపీల్చుకున్న పరిస్థితి. స్వప్నతో పాటు.. మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ కు చెందిన పార్శిల్లో రూ.15 కోట్లు విలువ చేసే ముప్ఫై కేజీల బంగారాన్ని ఈ నెల నాలుగున కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవటం సంచలనంగా మారింది. సాధారణంగా కాన్సులేట్ కు సంబంధించిన పార్శిళ్లను తనిఖీ చేయటం చాలా అరుదు. పక్కా సమాచారం అందటంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు.. కేరళ సచివాలయంలోని ఐటీ శాఖలో పని చేస్తున్న స్వప్న సురేశ్.. రాష్ట్ర సీఎంవోలో పని చేస్తున్న ప్రధాన కార్యదర్శి ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి కారణమైంది. ముఖ్యమంత్రి పినరయితో స్వప్నకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో.. ఈ వ్యవహారం రాజకీయ అంశంగా మారింది. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా తయారైంది. ఇప్పటికే దీనిపై ఎన్ఐఏ విచారణకు ఆదేశించటంతో పాటు.. స్వప్నకు పోస్టింగ్ ఇచ్చిన అధికారిపైనా చర్యలు తీసుకున్నారు.