కోటంరెడ్డిని ఏసుకున్న పిన్నెల్లి.. మరీ అంత స్థాయి లేనోడి మీద విమర్శలు ఏల?

Mon Feb 06 2023 10:21:14 GMT+0530 (India Standard Time)

Pinneli RamaKrishna Reddy About Kotam Reddy

గడిచిన వారం.. పది రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.. వైసీపీ నేత.. జగన్ కు విధేయుడిగా పేరున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మొన్నటివరకు వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలా ఉన్న ఆయన.. రెండు వారాలుగా తన గుండెల్లో దాచుకున్న మంటను బయటపెట్టటం.. అది కాస్తా అధికార పార్టీకి మహా ఇబ్బందికరంగా మారటం తెలిసిందే. కోటంరెడ్డి కారణంగా జరిగిన డ్యామేజ్ ను భర్తీ చేసుకునే విషయంపై జగన్ అండ్ కో ఇప్పుడు తీవ్రంగా కసరత్తు చేస్తోంది.అదే సమయంలో ముఖ్యమంత్రి మీద తమకున్న వీరవిధేయతనను ప్రదర్శించటానికి ఇంతకు మించిన అవకాశం రాదన్న భావనతో కొందరు వైసీపీ నేతలు ఇప్పుడు కోటంరెడ్డిని తిట్టిపోస్తున్నారు. ఘాటు విమర్శలు చేస్తూ.. ఫైర్ అవుతున్నారు. ఇలా ఏసుకుంటున్న వైసీపీ నేతల జాబితాలోకి చేరారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి.

కోటంరెడ్డి నోటి నుంచి వస్తున్న మాటలన్ని కూడా చంద్రబాబు స్క్రిప్టుగా ఫైర్ అయిన పిన్నెల్లి.. తమ పార్టీ ఎమ్మెల్యేలను గతంలో ఎలా అయితే ట్రాప్ చేసి తమ పార్టీలో చేర్చుకున్నారో.. ఇప్పుడు కూడా అదే రీతిలో కోటంరెడ్డిని ట్రాప్ చేసినట్లుగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ట్యాపింగ్ లో దొరికిపోయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఆయన స్థాయి కార్పొరేటర్ కంటే తక్కువన్నారు. కార్పొరేటర్ కంటే తక్కువ స్థాయి ఉన్నప్పటికీ కోటంరెడ్డిని జగన్ రెండుసార్లు పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారన్నారు.

తనను జైలుకు పంపించుకోవచ్చని కోటంరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారని.. తప్పు చేసిన వారు ఎవరైనా సరే జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. పార్టీ టికెట్ ఇచ్చి.. ప్రజలను ఒప్పించి మరీ కోటంరెడ్డిని ఎమ్మెల్యేగా చేసిన జగన్ ను విమర్శించటమా? అంటూ తనకున్న విధేయతను ప్రదర్శించారు.

పిన్నెల్లి చెప్పినట్లుగా కోటంరెడ్డికి నిజంగానే కార్పొరేటర్ స్థాయి కూడా లేని నేత అనే అనుకెుందాం. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేను చేశారనుకుందాం. ఇవాల్టి రోజున అధినేత జగన్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నప్పటికి.. స్థాయి లేనోడి మాటల్ని లైట్ తీసుకుందామని కాకుండా.. ఎంతో స్ట్రేచర్ ఉన్న పిన్నెల్లి లాంటి వారు సైతం నోరు ఎందుకు తెరుస్తున్నట్లు? అధినేత మనసు దోచుకోవాలన్న కాంక్షతోనే ఇలా మాటలు విసురుతున్నట్లుగా చెబుతున్నారు. పిన్నెల్లితో పాటు మరికొందరు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కోటంరెడ్డి ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.