Begin typing your search above and press return to search.

ఉక్కిరిబిక్కిరి చేసేలా జగన్ మాస్టర్ ప్లాన్.. ?

By:  Tupaki Desk   |   11 Feb 2022 10:30 AM GMT
ఉక్కిరిబిక్కిరి చేసేలా జగన్ మాస్టర్ ప్లాన్.. ?
X
ఏపీ సీఎం జగన్ విపక్షానికి ఊపిరి పీల్చుకునే టైమ్ కూడా ఇవ్వకుండా చేస్తారా. పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతారా అంటే జవాబు అవును అనే వస్తోంది. దీని కోసం జగన్ సరికొత్త కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. రానున్న రెండు మూడు నెలలు ఏపీలో రాజకీయం మొత్తాన్ని మార్చేలా జగన్ అజెండా ఉంటుంది అంటున్నారు. అంతే కాదు, ఇంతకాలం ఒక లెక్కలో సాగిన రాజకీయాన్ని పరుగులెత్తించేలా అధికార పక్షమే తెర తీస్తుంది అంటున్నారు.

ఏపీలో ఇపుడు కొత్త జిల్లాల ఇష్యూ నడుస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా జగన్ కొందరు మహానుభావుల పేర్లను కొత్త జిల్లాలను పెట్టేశారు. అలాగే పదమూడు కాస్తా ఇరవై ఆరు చేశారు. ఇక వీటి మీద అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే వాటిని పరిశీలిస్తారు, అంతా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఉగాది నుంచి కొత్త జిల్లాలలో పాలన రెడీ చేయాలని జగన్ డిసైడ్ అవుతున్నారు.

అదే టైమ్ లో మూడు రాజధానుల సమస్యను కూడా ముందుకు తేబోతోతున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలో మూడు రాజధానుల మీద సమ‌గ్రమైన బిల్లుని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది అంటున్నారు. ఆ విధంగా దాన్ని ఆమోదించుకుని న్యాయ వివాదాలకు తావు లేని తీరులో అమలు చేయాలని చూస్తోంది

ఇక కొత్త జిల్లాల విషయంలోనే విపక్షాలు ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాయి. వాటి పేర్ల మీద పోరాటాలు దీక్షలు చేస్తున్నారు. ఇపుడు మూడు రాజధానుల సమస్య కూడా తెర ముందుకు వస్తే ఏపీలో ఒక్కసారిగా హీట్ పెరిగిపోవడం ఖాయం. అంటే విపక్షాలకు ఏ సమస్య టేకప్ చేయాలి అన్నది అర్ధం కాని తీరులో ఈ రెండు కీలక నిర్ణయాలు ఒకే టైమ్ లో లైన్ లోని వచ్చేస్తాయి అన్న మాట.

వీటి తరువాత అంటే బడ్జెట్ సెషన్స్ ముగియడంతోనే జగన్ రచ్చబండ పేరిట జనంలోకి వెళ్తారని అంటున్నారు. అంటే మరో రెండేళ్లలో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి అన్ని పార్టీల కంటే ముందే జగన్ జనంలోకి వెళ్తారు అని అంటున్నారు. మరి ఈ వివాదాలు, రాజధానులు, జిల్లాలు వీటి మీద విపక్షాలు జనాల వద్దకు వెళ్లేలోగానే ముఖ్యమంత్రే వెళ్లి తనకు సానుకూలం చేసుకోవాలని చూస్తున్నారు అంటున్నారు.

మొత్తానికి రానున్న మూడు నెలలలో ఏపీ రాజకీయాన్ని హీటెక్కించాలని జగన్ చూస్తున్నారు. అన్నీ కలసి సమ్మర్ వేళకు ఏపీలో వేసవి వేడి ఒక లెవెల్ లో ఉంటుంది అని అంటున్నారు. ఇక చంద్రబాబు కానీ ఇతర విపక్షాలు కానీ దేని మీద ఆందోళన చేయాలన్న అజెండా సెట్ చేసుకోకుండానే ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్తుంది అన్నదే అసలైన పాయింట్. మరి జగన్ వ్యూహాలకు ప్రతి వ్యూహం టీడీపీ రెడీ చేసుకుంటుందా చూడాలి.