హైదరాబాద్ శోభాయాత్రలో గాడ్సే ఫోటో.. ఇదెక్కడి దరిద్రమండి?

Fri Mar 31 2023 10:10:25 GMT+0530 (India Standard Time)

Photo of Godse at Hyderabad Shobhayatra

అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అభిమానం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆశ్చర్యంతో పాటు ఆందోళనకు గురి చేసేలా మారిందని చెప్పాలి. శ్రీరామనవమి సందర్భంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న శోభాయాత్ర గురించి తెలిసిందే. పాతబస్తీలోని ప్రధాన వీధుల్లో సాగే ఈ శోభాయాత్రకు ఏడాదికేడాదికి వస్తున్న ఆదరణ అంతా ఇంతా  కాదు.



తాజాగా శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. యాత్రలో భాగంగా జాతిపిత గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సే నిలువెత్తు ఫోటోనుప్రదర్శించిన తీరును పలువురు తప్పుపడుతున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే తోపాటు వీహెచ్ పీ నిర్వహించిన ఈ శోభాయాత్రలో ఈ ఉదంతం ధూల్ పేటలో చోటు చేసుకుంది.

యాత్రలో భారీగా ప్రజలు హాజరయ్యారు. శోభాయాత్రలో భాగంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వాహనం మీద ఉండి యాత్రను స్వయంగా పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా.. కొందరు యువకులు శ్రీరాముని జెండాలు.. కాషాయ జెండాలతో పాటు..భారీ సైజులో ఉన్న గాడ్సే ఫోటోను ప్రదర్శించటం పలువురిని నిర్ఘాంత పోయేలా చేసింది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదేం పోయేకాలం.. భక్తిభావంతో శ్రీరాముని యాత్రను చేపట్టాల్సింది పోయి.. ఇలా చేయటం ఏమిటి? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తీరును ఖండించాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.