Begin typing your search above and press return to search.

భారత్ లో మరో పూలన్ దేవీ పుడుతుందా?

By:  Tupaki Desk   |   21 Nov 2020 1:50 PM GMT
భారత్ లో మరో పూలన్ దేవీ పుడుతుందా?
X
కొద్ది రోజుల క్రితం హాథ్‌రస్‌లో జరిగిన దళిత యువతి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. దళిత యువతిపై ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన యువకులు అత్యాచారం చేసి పాశవికంగా హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలికి న్యాయం జరగాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ ఘటన ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో చాలామందికి హథ్ రాస్ బాధితురాలు మనీషా గురించి తెలుసు. అయితే, దాదాపు 40 ఏళ్ల క్రితం హథ్ రాస్ కు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెహ్మాయ్ లో 18 ఏళ్ల యువతిపై ఇదే ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన యువకులు అత్యాచారం చేశారన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. 40 ఏళ్ల క్రితం తనపై జరిగిన అత్యాచారానికి ప్రతీకారంగా 22 మంది ఠాకూర్లను ఆ బాధిత యువతి ఊచకోత కోసిందని ఠాకూర్లు ఆరోపిస్తుంటారు. వారు ఆరోపిస్తోన్న ఆ బాధిత యువతి బందిపోటు రాణి పూలన్ దేవీ అన్న విషయం అతి తక్కువ మందికే తెలుసు. యూపీలో బందిపోటు పూలన్ దేవి ఠాకూర్లకు విలన్ అయితే....దళితులు, అట్టడుగు వర్గాల వారికి వీర వనిత.

18 ఏళ్ల వయసులో ఓబీసీ వర్గానికి చెందిన పూలన్ దేవి అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత బందిపోటు ముఠాను ఏర్పాటు చేసిన పూలమ్.... ప్రతీకారంగా 22 మంది ఠాకూర్లను కాల్చి చంపిందని ఠాకూర్లు ఆరోపిస్తుంటారు. దీంతో, బెహ్మాయ్ లో స్మారక ఫలకంపై ఓ బందిపోటు ముఠా వీరిని చంపిందని రాసి ఉంది. అయితే, ఈ విషయాన్ని పూలన్ అంగీకరించలేదు. ఠాకూర్ల చేతిలో బలైన కింది కులాల మహిళల పోరాటానికి ఓబీసీ అయిన పూలన్ ప్రతీకగా మారారు. ఫూలన్‌కు, ఆమె సహచరులకు పేద ప్రజల మద్దతు ఉండేది. పెద్దలను కొల్లగొట్టి పేదలకు పంచేవారు పూలన్. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫూలన్ పోలీసులకు లొంగిపోయారు. విచారణ జరగకుండా ఫూలన్ 11 ఏళ్లు జైల్లోనే ఉన్నారు. ములాయం సింగ్ హయాంలో 1994 పూలన్ పై కేసులు ఎత్తివేశారు. 1996, 1999లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున మీర్జాపూర్ లోక్‌సభ స్థానం నుంచి పూలన్ విజయం సాధించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఢిల్లీలోని తన ఇంటి దగ్గరే ఫూలన్ హత్యకు గురయ్యారు. హత్య జరిగే నాటికి ఆమె వయసు 38 ఏళ్లు. బెహ్మాయ్‌లో పూలన్ చేతిలో చనిపోయినవారికి స్మారకంగా ఓ క్షేత్రం ఉంటే, ఇటు ఫూలన్ దేవికి స్మారకంగా పూలన్ స్వగ్రామం జహన్ పూర్ లో మరో క్షేత్రం ఉంది. ఈ రెండు ఊళ్ల వాళ్లు ఇప్పటికీ కలుసుకోరు. వాస్తవానికి 2020 జనవరిలో ఈ కేసులో కోర్టు తీర్పు రావాల్సింది. ఓ పోలీస్ డైరీ గల్లంతవ్వడంతో తీర్పు లేటయింది.