Begin typing your search above and press return to search.

రాజకీయ పదవుల వ్యవహారం.. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలపై కీలక పిటిషన్‌!

By:  Tupaki Desk   |   30 May 2023 5:00 PM GMT
రాజకీయ పదవుల వ్యవహారం.. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలపై కీలక పిటిషన్‌!
X
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై సుప్రీంకోర్టులో కీలక పిటిషన్‌ దాఖలైంది. వీరు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేశాక రెండేళ్ల పాటు విరామం (కూలింగ్‌ ఆఫ్‌) ఉన్నాకే పదవులు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బాంబే న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేశాక రెండేళ్ల విరామం ముగిశాకే వారు గవర్నర్‌ వంటి రాజకీయ పదవులను చేపట్టేలా చూడాలని సుప్రీంకోర్టుకు న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి చేసింది. న్యాయమూర్తులు ఇలాంటి రాజకీయ పదవులను స్వీకరించడం వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు నెలకొంటున్నాయని తన పిటిషన్‌ లో న్యాయస్థానం దృష్టికి తెచ్చింది.

ఈ మేరకు బాంబే న్యాయవాదుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అహ్మద్‌ మెహ్దీ అబ్దీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాక ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ 2023 ఫిబ్రవరి 12న నియమితులయ్యారని ఆయన గుర్తుచేశారు. అందువల్లే తాము ఈ పిటిషన్‌ దాఖలు చేసినట్టు వెల్లడించారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ పి.సదాశివం కూడా కేరళ గవర్నర్‌గా పనిచేశారని అబ్దీ గుర్తు చేశారు.

అలాగే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ రాజ్యసభకు నామినేట్‌ చేయబడ్డారని అబ్దీ తన పిటిషన్‌ లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో 'పదవీ విరమణ తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు మరే ఇతర రాజకీయ నియామకాలను అంగీకరించకుండా రెండేళ్ల కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ ఉండాలి' అని ఆదేశించేలా ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాదుల సంఘం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.

పదవీ విరమణ తర్వాత ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు రాజకీయ పదవిని స్వీకరించే ముందు వారికి రెండేళ్ల కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ ఉంటుందని నియామక సమయంలో షరతు విధించడంతోపాటు, పదవీ విరమణ చేసే న్యాయమూర్తులను రాజకీయంగా అలాంటి పదవులను అంగీకరించవద్దని ఆదేశించాలని న్యాయవాదుల సంఘం తన పిటిషన్‌ లో సుప్రీంకోర్టును కోరింది.

ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంపై నివేదికను ప్రస్తావిస్తూ.. మాజీ సీజేఐ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్‌ బీసీసీఐలో అనేక సంస్కరణలను సిఫార్సు చేసిందని బాంబే న్యాయవాదుల సంఘం తన పిటిషన్‌ లో గుర్తు చేసింది. బీసీసీఐలో కూలింగ్‌ పీరియడ్‌ ఉండాలని సూచించిందని పేర్కొంది.

జస్టిస్‌ నజీర్‌ను గవర్నర్‌గా నియమించడం, మాజీ సీజేఐ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. అటువంటి పదవులను స్వీకరించడం న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని న్యాయవాదుల సంఘం అభిప్రాయపడింది.