Begin typing your search above and press return to search.

మరోసారి ఇరకాటంలో రిషి సునక్: స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణంపై విమర్శలు

By:  Tupaki Desk   |   15 Aug 2022 1:30 PM GMT
మరోసారి ఇరకాటంలో రిషి సునక్: స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణంపై విమర్శలు
X
బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునక్ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఆయన ప్రధాని కాకుండా అక్కడి మీడియా రోజుకో అంశాన్ని లేనెత్తుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన జీవితంలోని ప్రతీ అంశాన్ని వివాదంగా మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారని రిషి సునక్ మద్దతు దారులు వాపోతున్నారు. తాజాగా రిషి సునక్ కు సంబంధించిన స్మిమ్మింగ్ ఫూల్ నిర్మాణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రజలు ఓ వైపు తాగునీటి కోసం అల్లాడుతుంటే ప్రధాని కాబోయే వ్యక్తి స్విమ్మింగ్ ఫూల్ లో ఎంజాయ్ చేస్తున్నారని 'ది ఇండిపెండెంట్' ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యవహారంలో రిషు సునక్ భవిష్యత్ పై ప్రభావం పడనుందా..? అనే చర్చ సాగుతోంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా యూకేలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో నదులు, సరస్సుల్లో సైతం నీటి చుక్కా లేకుండా పోయింది. వడగాల్పులు, కరువుతో ప్రజలు అల్లాడుతుండగా రిషి సునక్ విలాసవంతమైన భవనంలో ఎంజాయ్ చేస్తున్నారని తెలిపింది. ది ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. నార్త్ యార్క్ షైర్ లో సునక్ కు ఓ విలాసవంతమైన భవనం ఉంది. వీకెండ్ ఆయన తన భార్య అక్షిత మూర్తి, పిల్లలతో కలిసి ఇక్కడికి వెళ్తుంటారు. ఇప్పటికే రిషి లైఫ్ స్టైల్ ను అబ్జర్వ్ చేస్తున్న యూకే మీడియా సునక్ కు సంబంధించిన భవనం, స్విమ్మింగ్ ఫూల్ ఫొటోలను తీసి ప్రచురించింది. ఈ ఫొటోలను హైలెట్ చేస్తూ కథనం ప్రచురించింది.

ఓ వైపు ప్రజలు నీటిత కొరతతో అల్లాడుతుంటే రిషి సునక్ 400,000 పౌండ్లు (రూ.3.8 కోట్లు) ఖర్చుతో స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణం చేపడుతున్నారని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి.

అయితే రిషి సునక్ కుటుంబం ఇప్పటికే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. గతంలో ఆయన ఇంటికి జర్నలిస్టులు వచ్చినప్పుడు తన భార్య అక్షిత మూర్తి ఖరీదైన కప్పుల్లో టీ ఇచ్చే ఫొటోలు బయటకు వచ్చాయి. బోరిక్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా కొనసాగిన రిషి సునక్ భారీగా పన్నులు విధించారని, ఆయన మాత్రం ఖరీదైన వస్తువులు వాడుతున్నారని విమర్శలు చేశారు.

బ్రిటన్ ఎన్నికలకు మరో నెలరోజుల గడువు మాత్రమే ఉంది. ప్రధాని రేసులో రిషి సునక్, యూకే ఫారిన్ సెక్రెటరీ లిజ్ ట్రస్ పైచేయి సాధిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ తరుణంలో రిషి సునక్ పై వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి.

దీంతో రిషి సునక్ ను ఇంకా ఎన్ని సమస్యలు చుట్టుముట్టుకుంటాయోనని చర్చించుకుంటున్నారు. అయితే భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రధాని రేసులో ఉన్నాడనే అక్కసుతోనే యూకే మీడియా చిన్న చిన్న అంశాలను హైలెట్ చేస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే రిషి సునక్ పై వచ్చిన ఆరోపణలను నివృత్తి చేసుకుంటే తప్ప ప్రధాని రేసులో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.