ఫ్యాన్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన పవన్!

Tue Mar 26 2019 16:36:47 GMT+0530 (IST)

తాను ప్రచారానికి వెళ్లిన ప్రతిచోటా ఎవరో ఒకరికి వార్నింగ్ ఇవ్వకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వదిలిపెట్టరు. తాజాగా అదే తీరును ప్రదర్శించారు. తాజాగా ఆయన నెల్లూరు రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కు ఊహించని రీతిలో షాకింగ్ వార్నింగ్ ఇచ్చారు. అనిల్ తన అభిమాని అని తరచూ చెబుతుంటాడన్న పవన్.. ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన నా అభిమాని అంటూ రెండు మూడుసార్లు కలిశాడని చెప్పారు. ఆ  సందర్భంగా తాను.. బెట్టింగులు మానేసి.. నా అభిమాని అని చెప్పు అని చెప్పినట్లుగా చెప్పారు.తన అభిమాని అంటూ చెప్పుకున్న ప్రత్యర్థి అభిర్థిని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు.. వార్నింగ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అనిల్ కుమార్ తానిచ్చే ఇంటర్వ్యూలలో తాను పవన్ అభిమానినని చెబుతుంటారు. ఈ మధ్యన ఆయన మాట్లాడుతూ తాను పవన్ ఫ్యాన్ అని చెప్పుకోవటానికి సిగ్గు పడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇక.. నెల్లూరులో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు  బెట్టింగ్ నిపుణులంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జెండా ఏ వైపు ఎగుతుంది?  మొదలు ప్రతి విషయం మీదా బెట్టింగ్ కడతారన్నారు. మీకెందుకు రాజకీయాలు?  కబ్బుల్లో కూర్చొని పేకాట.. బెట్టింగులు ఆడుకోడంటూ మండిపడ్డారు. టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసుల మీద కూడా రౌడీయిజం చేస్తారన్న పవన్.. తమ రూరల్ అభ్యర్థి మనుక్రాంత్ రెడ్డి ఐటీ కంపెనీ పెట్టి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు.

తమ నెల్లూరు సిటీ అభ్యర్థి  వినోద్ రెడ్డి నెల్లూరు సమస్యల మీద పోరాటం చేసిన వైనాన్ని పవన్ గుర్తు చేశారు. ఇలా.. తన ప్రత్యర్థి అభ్యర్థులపై విరుచుకుపడిన పవన్.. ఏపీ మంత్రి నారాయణను వదలిపెట్టలేదు. నారాయణను వదిలిపెట్టేది లేదన్న ఆయన.. తాను నెల్లూరు రొట్టెల పండక్కి రావాలనుకుంటే తనను ఆపారన్నారు. నెల్లూరు తమ అమ్మ సొంతూరని.. ఫతేకాన్ పేట.. మూలాపేట.. టెక్కేమిట్టా ఇలా ప్రతి దగ్గరా తనకు కావాల్సిన మనుషులు ఉన్నట్లు చెప్పారు. మొత్తంగా తమ అభ్యర్థులపై బరిలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థుల చరిత్రల్ని విప్పి చెప్పి.. తమ అభ్యర్థి మేలి ముత్యంగా పవన్ అభివర్ణించటం గమనార్హం. మరి.. నెల్లూరు ఓటర్లు తుది తీర్పు ఎలా ఇస్తారో చూడాలి.