జగన్ సంచలన నిర్ణయానికి పీకే మద్దతు పలికారే!

Mon Jun 24 2019 18:47:44 GMT+0530 (IST)

Pawan kalyan Supports Jagan over Demolition of Praja Vedika

వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయానికి జనసేన అదినేత పవన్ కల్యాణ్ మద్దతు లభించేసింది. నేటి ఉదయం కృష్ణా కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజా వేదికలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన సందర్భంగా... ఆ నిర్మాణం అక్రమ కట్టడమేనని తేల్చేసిన జగన్ ఎల్లుండి దానిని కూల్చివేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై విపక్ష టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వ నిధులతో కట్టిన నిర్మాణాన్ని అక్రమ నిర్మాణంగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించిన టీడీపీ నేతలు... దానిని కూల్చివేయడమంటే తమ పార్టీ అధినేత - విపక్ష నేత నారా చంద్రబాబునాయుడిపై కక్షసాధింపు చర్యగానే పరిగణించాల్సి వస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ నుంచి మాత్రం జగన్ నిర్ణయానికి అనూహ్యంగా మద్దతు లభించింది.జనసేనకు సంబంధించి నూతన కమిటీలను ప్రకటించేందుకు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సందర్భంగా పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణా కరకట్టపై నిర్మించిన ప్రజా వేదిక అక్రమ నిర్మాణమే అయితే దానిని కూల్చివేయాలంటూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లుగా పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. అయితే అక్రమ  నిర్మాణంగా తేల్చిన ప్రజా వేదికను కూల్చడంతోనే సరిపెట్టరాదని - కృష్ణా కరకట్టపై అక్రమంగా వెలసిన అన్ని నిర్మాణాలను కూడా కూల్చివేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

అప్పుడే జగన్ సర్కారుపై నమ్మకం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ సర్కారు మంచి పని చేస్తే స్వాగతిస్తామని ప్రకటించిన పవన్... జగన్ సర్కారుపై ఏడాది పాటు ఎలాంటి విమర్శలు చేయమని తేల్చేశారు. హైదరాబాద్ లో తెలంగాణ సర్కారుకు అప్పగించిన భవనాల విషయంలో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని కూడా ఆయన కోరారు. మొత్తంగా ప్రజా వేదిక కూల్చివేతపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా పవన్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.