ఆ రెండు అక్షరాలు టీడీపీ అధికారాన్నిదూరం చేస్తున్నాయా?

Mon Apr 22 2019 20:00:01 GMT+0530 (IST)

Pawan kalyan Is Reason Behind TDP Loss in Elections

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయం అని వాదించే వాళ్లు పలు లాజిక్స్ ను ప్రస్తావిస్తూ ఉంటారు. గత ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చిన అంశాలు ఏమిటి - ఈ సారి టీడీపీకి మైనస్ గా మారినవి ఏవి? అనే అంశాల గురించి కూలంకషమైన విశ్లేషణలు సాగుతూనే ఉన్నాయి. అలాంటి వాటిల్లో పవన్ కల్యాణ్ ఫ్యాక్టర్  ఒకటి. పీకే అనే రెండు అక్షరాలు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అధికారాన్ని దూరం చేస్తున్న విశ్లేషణ కూడా ఒకటి వినిపిస్తూ ఉంది!గత ఎన్నికల్లో 'పీకే' బలం తెలుగుదేశం పార్టీకి కలిసి రాగా - ఈ సారి మైనస్ అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ సమయంలో తెలుగుదేశం గ్రాఫ్ అనూహ్యంగా పెరగడానికి కారణం పవన్ కల్యాణ్ అనే విశ్లేషణ ఉంది. పవన్ కల్యాణ్ తమ గెలుపులో పాత్రను కలిగిలేడని తెలుగుదేశం వాళ్లు వాదించవచ్చు. అయితే క్షేత్ర స్థాయిలో ప్రజలకు అన్ని విషయాలూ  తెలుసు.

పవన్ మద్దతు లేకపోయి ఉంటే.. గత ఎన్నికల్లోనే టీడీపీకి చాలా వరకూ మెజారిటీలు తగ్గిపోయేవని - బోటాబోటీ మెజారిటీతో బయటపడిన స్థానాల్లో ఆ పార్టీకి విజయమే దక్కేది కాదని పరిశీలకులు చెబుతారు.
ఈ క్రమంలో.. ఈ సారి పవన్ కల్యాణ్ వేరేగా పోటీ చేశారు. ఒక దశలో పవన్ తో పొత్తు కోసం బాబు చాలా ప్రయత్నించారనేది అందరికీ తెలిసిన సంగతే. అయితే అప్పటికే పవన్ ముందుకు వెళ్లిపోయారు.

పొత్తు పెట్టుకుంటే జనాలు నవ్వుతారని భయపడాల్సి వచ్చిందంటారు. ఇక పవన్ పార్టీ వేరేగా పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది అనేది ఒక విశ్లేషణ. అది  కొంత వరకూ వాస్తవమే కానీ.. పవన్ వల్లా కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినా టీడీపీకి ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు పరిశీలకులు.

పవన్ ఓటు బ్యాంకు టీడీపీకి కలిసి వస్తే ఎంతో ప్లస్ అవుతుంది - పవన్ కల్యాణ్ వేరేగా పోటీ చేయడం వల్ల ఆ ఓట్లు టీడీపీకి దూరం కావడం గమనించాల్సి ఉంటుంది. ఈ పరిణామం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిని సులభం చేసిందని అంటున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం కొద్ది శాతం తక్కువ  ఓట్లను సాధించుకుని అధికారానికి దూరం అయ్యింది.

ఇప్పుడు పవన్ ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీ నుంచి దూరం అయిన సమీకరణాల మధ్యన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఓటు బ్యాంకును  అలాగే పెట్టుకున్నా.. సులభంగా ఎన్నికల్లో విజయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ విషయం కూడా సుస్పష్టం అవుతుందని - అప్పుడు మరింత క్లియర్ గా చెప్పవచ్చని వారు అంటున్నారు.